ప్రశ్న:-”నా వయస్సు 57 సంవత్సరాలు. కుటుంబపరమైన బాధ్యతల వల్ల వివాహం చేసుకోలేదు. పైగా నేనొక బాధ్యతాయుతమైన ఆఫీసరుగా ఉండబట్టి ఏ స్త్రీతోనూ సెక్స్ కోసం సాహసించలేదు. బ్రహ్మచర్యం ఎలాగూ ఆరోగ్యానికి మంచిదనే ఫిలాసఫీతో హస్తప్రయోగం కూడా అరుదుగానే చేశాను. వీర్యం పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వచ్చాను. అయినప్పటికీ నా ఆరోగ్యం చెడింది. ఎప్పుడూ నీరసం అనిపిస్తుంది. బి.పి., షుగరు కూడా వచ్చాయి. డల్‌గా ఉంటాను. ఏ పని మీదా ఆసక్తి ఉండటం లేదు. ఇంకా సర్వీసు ఉంది. ఈ నీరసంతో పనిచేయడం ఎలాగో తెలియడం లేదు. నా స్నేహితులు 65-70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇప్పటికీ సెక్స్‌లో పాల్గొంటున్నారు. హుషారుగా, ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ సెక్స్‌లో పాల్గొనే వాళ్ళకి టెన్షన్స్ ఉండవని, ఒకవేళ మానసిక ఒత్తిడి కలిగినా సెక్సులో పాల్గొనడంతో రిలీఫ వచ్చేస్తుందని చెప్పగా విన్నాను. 57 సంవత్సరాలకే నేను నీరసపడిపోవడం, డల్‌గా మారడం పెళ్ళిచేసుకోకపోవడం వల్లనేనా?”
జవాబు:- దాంపత్య జీవితం తప్పకుండా రిలీఫ్ ప్రసాదిస్తుంది. భార్యాభర్తల మధ్య పెంపొందే ఎమోషనల్ ఎటాచ్‌మెంటు, సహకారం తప్పకుండా డిప్రెషన్ నుంచి దూరంగా ఉంచుతుంది. మీరు ఎంతగా బ్రహ్మచర్యం అవలంభించినా షుగరు, బి.పి. రావడానికి మీ ఉద్యోగంలో మానసిక ఒత్తిడి, టెన్షన్ ఎక్కువ ఉండడం ఒక కారణం. మీ లైఫ్‌స్టైల్ కూడా మరికొంత కారణం. వీర్యం పోకుండా ఎంత కాపాడుకున్నా ప్రయోజనం లేదు. బ్రహ్మచర్యం ఆయుష్షుని, ఆరోగ్యాన్ని పెంచుతుందనడంలో ఎటువంటి నిజం లేదు. పైగా బ్రహ్మచర్యంతో మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. మీ విషయంలో డిప్రషన్ ఉంది. డాక్టరుకి చూపించుకుని చికిత్స పొందండి. ఒంటరితనం వీడి అందరితో సరదాగా గడపండి. ఈ వయస్సులో కూడా ఏ స్త్రీ అయినా మీకు తోడుగా ఉంటానంటే పెళ్ళి చేసుకోండి. తప్పు ఏమీ లేదు. పెళ్ళి అనేది మీ స్వంత విషయం.