ప్రశ్న:-”శరీరంలో కల్మషాలు కొట్టుకుపోవడానికి మంచినీళ్ళు చాలా ఎక్కువ తాగాలంటారు కదా. రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? రోజు మొత్తం మీద 6-8 లీటర్లు నీళ్ళు తాగితే సరిపోతుందా? భోజనం చేస్తున్నప్పుడు మంచి నీళ్ళు తాగకూడదని, మంచినీళ్ళు తాగితే జీర్ణానికే తోడ్పడే రసాయనాలు పలచన అయిపోయి ఆహారం జీర్ణం కాదని అంటారు కదా. మరి కారం తగిలి నోరు మండితే ఏం చేయాలి?”
జవాబు:- శరీరంలోని మాలిన్యాలు కొట్టుకుపోవడానికి రోజూ మంచినీళ్ళు చాలా ఎక్కువ తాగాలని ఎవరైనా చెపితే అది పూర్తిగా తప్పు. రోజు మొత్తం మీద రెండు లేక మూడు లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. శరీరంలోని మాలిన్యాలు చెమట ద్వారా కొంత విసర్జింపబడగా, మూత్రం ద్వారా కొంత విసర్జింపబడతాయి. రక్తంలో చేరిన మాలిన్యాలని మూత్రపిండాలు తేలికగా వేరుచేసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఇలా మూత్రం ద్వారా, చెమట ద్వారా మాలిన్యాలు బయటకు పోవడానికి 2 నుంచి 3 లీటర్ల నీరు చాలు. అంతకంటే ఎక్కువ నీళ్ళు తాగితే ఆ నీటిని బయటకు పంపడానికి మూత్రపిండాలు అనవసరంగా అధికంగా పనిచేయవలసి వస్తుంది. మూత్రపిండాలకి ఇటువంటి శ్రమ కలిగించకూడదు. ఇది ఇలా ఉండగా రక్తంలో ఇన్ని మిల్లీలీటర్లకి ఇంత శాతంలో షుగర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రకరకాల హార్మోన్లు, ఎంజైమ్స్ ఉండాలని ఉంటుంది. అలా నిర్ధారిత శాతంలో ఇవి ఉన్నప్పుడే శరీర ధర్మాలు అన్నీ సక్రమంగా నిర్వహించబడతాయి. వీటి శాతంలో సమతుల్యం లోపిస్తే శరీరం నిర్వహించే ధర్మాల్లో తేడా వస్తుంది. మంచినీళ్ళు అనవసరంగా ఎక్కువ తాగితే అవి రక్తంలోకి చేరిపోయి పైన చెప్పుకున్న లవణాలు హార్మోన్ల సాంద్రతలో లోపం ఏర్పడి శరీర ధర్మాల నిర్వహణలో అస్తవ్యస్తత ఏర్పడుతుంది. వడదెబ్బ తగిలినప్పుడు, వాంతులు, విరోచనాలు అయినప్పుడు తప్ప అనవసరంగా ఎక్కువ నీరు తాగడం మంచిదికాదు. ఎవరికైనా అతి దాహం ఉంటే షుగర్ జబ్బుగాని, మరొకటి గాని ఉందేమో పరీక్ష చేయించుకుని చికిత్స పొందాలి. పోతే భోజనం మధ్యలో నీళ్ళు నిరభ్యంతరంగా తాగవచ్చు. నీళ్ళు తాగితే జీర్ణరసాయనాలు పలచన అయిపోయి ఆహారం అరగదని అనడంలో అర్థంలేదు. కుండలో నీళ్ళులాగా జీర్ణాశయంలో జీర్ణ రసాయనాలు నిండి ఉండవు. ఆహారం కడుపులో పడిన తరువాతే, రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మంచినీళ్ళు తాగడం వల్ల ఇవి పలచన అవడమనేది ఉండదు. అంతేకాకుండా తాగిన మంచినీళ్ళు కుండలో పోసిన నీళ్ళలాగా నిలిచి ఉండిపోవు. పేగుల కదలికతో ముందుకు సాగిపోతాయి. పేగులు ఆ నీటిని పీల్చేసుకుంటాయి. ఇది అలా ఉండగా పేగులలో దేనికవి సెలెక్టెడ్‌గా గ్రంథులు ఉంటాయి. ఆహారాన్ని బట్టి ఆ గ్రంథులు జీర్ణరసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. అందుకని భోజనం సమయంలో మంచినీళ్ళు తాగకూడదనేది అర్థం లేనిమాట. మీరు నిరభ్యంతరంగా మంచినీళ్ళు తాగండి. నోరు మండినా, ముద్ద మింగడానికి మధ్య మధ్యలో మంచినీళ్ళు కావాలన్నా ఎటువంటి సంకోచం లేకుండా తాగండి.