ప్రశ్న:- ”నా వయస్సు 18 సంవత్సరాలు, మేము చాలా పేదవాళ్ళం. ముఖం మీద విపరీతమైన మొటిమలు ఉన్నాయి. అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఒక స్నేహితుడు నిమ్మకాయ రసం పూసుకుంటే మొటిమలు ఉండవన్నాడు. అతని సలహా మేరకు నిమ్మకాయ రసం పూసుకున్నాను. అయినా మొటిమలు తగ్గలేదు. ఇంకా ఎక్కువయ్యాయి. మొటిమలతో వికారమైన ముఖాన్ని చూసుకుని ఎంతో బాధ కలుగుతోంది. చచ్చిపోవాలని ఉంది. మీరే నన్ను రక్షించాలి.
జవాబు:- యుక్త వయస్సు వచ్చిన తరువాత అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా మొటిమలు రావడం అతి సాధారణ విషయం. మొటిమలనేవి తొంగి చూస్తున్న తొలకరి యవ్వనానికి సంకేతం. వాటికి యవ్వనంలో అడుగుపెడుతున్న వాళ్ళు గర్వపడాలిగాని కృంగిపోకూడదు. మొటిమలు కొద్దిపాటిగా ఉన్నప్పుడు పట్టించుకోనవసరం లేదు. కొందరికి ఆవగింజంతగా మొదలై పెసర గింజంత అయి, వాచి, చీముపట్టి నొప్పి కలిగిస్తాయి. వాటిని గిల్లడంగాని, పిండటం గాని చేయకూడదు. మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎజిథ్రోమైసిన్ 500 మి.గ్రా. బిళ్ళలు రోజుకి ఒకటి చొప్పున 3 రోజులు వాడాలి. మొటిమలు మీద ఎరిథ్రోమైసిన్ 2% క్రీము లేదా క్లిండామైసిన్ 2% సొల్యూషన్ రోజుకి 2-3 సార్లు రుద్దాలి. దాంతో తగ్గిపోతాయి. అప్పటికీ చీము పొక్కులు ఉంటే ‘డాక్సిసైకిలిన్’ 100 ఎం.జి. బిళ్ళలు ఉదయం-1, సాయంత్రం-1 చొప్పున 6 వారాలు వాడాలి. ముఖం మీద ఇతర క్రీములు వేరేవి ఏవీ రాయకూడదు. కొందరికి అప్పుడు తగ్గిపోయి మళ్ళీ కొంత కాలానికి వస్తాయి. అప్పుడూ మళ్ళీ పైవిధంగానే మందులు వాడాలి.