ప్రశ్న:- ”జ్వరం తగ్గిన తర్వాత పథ్యం తీసుకున్న రోజున వెంటనే నిద్రపోకూడదా? పథ్యం తీసుకున్న తర్వాత ఎంతసేపు మేల్కొని ఉండాలి? వెంటనే నిద్రపోతే వ్యాధి తిరగబెడుతుందా?
జవాబు:- జ్వరం వస్తే భోజనం చేయకూడదనేది ఒకనాటి మాట. ఇప్పుడు ఎంత జ్వరం ఉన్నప్పటికీ తినాలని ఉంటే మామూలుగా భోజనం చేయవచ్చు. ఆకలి, అరుగుదల ఉంటే అన్నీ తినేయవచ్చు. కేవలం టైఫాయిడ్ లాంటి జ్వరాల్లోనే జీర్ణకోశం ప్రేగులకి పుండు ఉండి కడుపు ఉబ్బరంగా ఉండే పరిస్థితుల్లో తప్ప మామూలుగా భోజనం చేయవచ్చు. జ్వరం ఉన్నప్పుడు తినకూడదనేది, జ్వరం తగ్గాక పథ్యం అనేది అర్థం లేని విషయం. జ్వరం ఉన్నప్పుడు భుజించినా, జ్వరం తగ్గిన తర్వాత అన్నం తిన్నాక నిద్రపోకుండా కూర్చోనవసరం లేదు. నిద్రపోవడం వల్ల పోయిన జ్వరం తిరిగి కనబడటమనేది ఉండదు. ఒకవేళ పథ్యం తీసుకున్న తర్వాత తిరిగి జ్వరం కనబడితే జబ్బు పూర్తిగా తగ్గకపోవడం వల్లనే తప్ప పథ్యం తీసుకున్న తర్వాత నిద్రపోవడం వల్ల మాత్రం కాదు.