ప్రశ్న:-”నేను ఇదివరకు కొందరు అమ్మాయిలతో తిరిగిన మాట వాస్తవం. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో ఎయిడ్స్ లేదని వచ్చింది. తరువాత పెళ్ళి చేసుకుని బుద్ధిగా ఉన్నాను. ఇటీవల తరచూ కండరాల నొప్పులు అనిపిస్తున్నాయి. తల దిమ్ముగా ఉంటోంది. నీరసపడ్డాను. బరువు తగ్గాననిపిస్తోంది. అప్పుడు కనబడని ఎయిడ్స్ ఇప్పుడు బయటపడిందేమోనని భయంగా ఉంది. రక్తపరీక్ష చేయించుకోవాలంటే ఎయిడ్స్ ఉందని రిపోర్టు వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకని టెస్టు చేయించుకోలేకపోతున్నాను. ఎప్పుడూ ఒకటే భయం. ఆ భయాన్ని తట్టుకోలేక అప్పుడప్పుడు వణుకు కూడా వస్తోంది. నేను ఎయిడ్స్ రోగిని అయిపోయానా? నాతోపాటు నా భార్య కూడా ఎయిడ్స్ రోగి అయిందా? ఎయిడ్స్ అని అనుమానం వచ్చిన దగ్గర నుంచి ప్రతి చిన్న దానికీ షేక్ అయిపోతున్నాను. నన్ను మీరే రక్షించాలి.”
జవాబు:- మీరు రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు ఎయిడ్స్ లేదని వచ్చింది కదా. అందుకని నిబ్బరంగా ఉండండి. మీలో ఎయిడ్స్ భయం చోటు చేసుకుంది. అయినా మళ్ళీ ఒకసారి ఎయిడ్స్ టెస్టు చేయించుకోండి. ఎయిడ్స్ సోకినట్టు ముందుగానే తెలుసుకోగలిగితే తగిన జాగ్రత్తలతో చాలా సంవత్సరాల పాటు హ్యాపీగా ఉండవచ్చు. భయంతో ఎయిడ్స్ వ్యాధిని దాచుకుంటే అది రోగి ఎడల ఏమాత్రం జాలి చూపించదు. అందుకని అనుమానం ఉన్నవాళ్ళు ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా, హాయిగా ఉండవచ్చు.