ప్రశ్న:- ”నా వయస్సు 48 సంవత్సరాలు. జ్వరంగా ఉందని ఒక చిన్న డాక్టరు దగ్గరికి వెళ్ళాను. అతను తన దగ్గర ఉన్న సూదితోనే నాకు ఇంజక్షన్ చేశాడు. ఆ సూది అంతకు ముందు మరొకరికి వాడి ఉంటాడని నా అనుమానం. అతని దగ్గరికి సుఖవ్యాధులు, ఎయిడ్స్ ఉన్నవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎయిడ్స్ రోగికి వేసిన సూదితో నాకు కూడా వేస్తే ఆ డబ్బు తప్పకుండా వస్తుంది కదా. అతన్ని నిలదీసి అడిగాను. అదేమీ లేదన్నాడు. తప్పుచేసిన వాడు తప్పు ఒప్పుకోడు కదా. అందుకని నా అనుమానం, భయం అలాగే ఉన్నాయి. వెంటనే లాబ్‌కి వెళ్ళి హెచ్ఐవి టెస్టు, హెపటైటిస్-బి టెస్టు చేయించుకున్నాను. అందులో ఏమీ లేదన్నారు. అందుకని పిసిఆర్ టెస్ట్ చేయించుకున్నాను. అందులోనూ లేదన్నారు. వారం రోజుల్లో ఈ టెస్టులన్నీ అయిపోయాయి. ఈ టెస్టుల్లో వెంటనే తెలియదట కదా. నాకు ఎయిడ్స్ వచ్చినట్టేనా? నా బ్రతుకు పాడైపోయినట్టేనా? చాలా భయంగా ఉంది.”
జవాబు:- మీలో ఎయిడ్స్ ఫోబియా తలెత్తింది. సూదిలో కండకి ఇంజక్షన్ చేసినప్పుడు ఎయిడ్స్ వైరస్ సంక్రమించే అవకాశం చాలా అరుదు. అదీ కాక సూదికి ఎయిడ్స్ వైరస్ అంటుకున్నప్పటికీ మామూలు వాతావరణంలో కొద్ది సెకన్లలోనే నాశనం అవుతుంది. అందుకని మీరు భయపడకండి. మూడు నెలల తర్వాత తిరిగి హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి. దాంతో మీ భయం పూర్తిగా తొలగిపోతుంది. ఇంజక్షన్ సూది ద్వారా ఎయిడ్స్ సంక్రమించడం అనేది ఎక్కువగా నరానికి చేసే ఇంజక్షన్ సూదివల్లే అవుతుంది. ఏమైనప్పటికీ ఎవరిమటుకు వాళ్ళు డిస్పోజబుల్ సిరంజస్నే వాడటం సరైన పద్ధతి. అనవసరమైన ఇటువంటి భయాలు ఉండవు.