ప్రశ్న:- ”డ్రగ్ ఎడిక్ట్స్లో ఎయిడ్స్ ఎక్కువగా ఉంటుందని విన్నాను. మత్తు మందులు, మాదక ద్రవ్యాలు ఎయిడ్స్‌ని కలిగిస్తాయా? సెక్స్‌తో సంబంధం లేకుండానే ఎయిడ్స్ క్రిములు వీళ్ళల్లో చేరుతాయా? నాకు గంజాయి తీసుకునే అలవాటు ఉంది. నేనింత వరకు ఏ స్త్రీతోనూ సెక్స్‌లో పాల్గొనలేదు. మరి నాకు కూడా ఎయిడ్స్ సోకుతుందా?”
జవాబు:- ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారితో సెక్స్‌లో పాల్గొనడం, ఆ వ్యాధి ఉన్నవారి రక్తం ఎక్కించుకోవడం, ఆ వ్యాధి ఉన్నవారికి ఇంజక్షన్ చేసిన సూదితో వెంటనే మరొకరికి చేయడం, తల్లికి ఈ వ్యాధి ఉంటే పుట్టే బిడ్డకి రావడమే తప్ప మరే విధంగానూ ఎయిడ్స్ రావడం ఉండదు. డ్రగ్ ఎడిక్ట్స్లో విశృంఖల శృంగారం కూడా ఉంటుంది. కొన్ని డ్రగ్స్ ఇంజక్షన్ల రూపంలో కూడా తీసుకుంటారు. సాధారణంగా డ్రగ్ ఎడిక్ట్స్ నలుగురైదుగురు ఒకే గ్రూపుగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఒకే సిరంజిలోకి అధిక మోతాదులో మత్తు ఇంజక్షను లోడ్ చేసుకుని ఒకే సూదితో వరుసగా ఇంజ్షను చేసుకుంటారు. ఆ డ్రగ్ ఎడిక్ట్స్లో ఎవరో ఒకరికి ఎయిడ్స్ ఉన్నట్టయితే ఒకే సూది, ఒకే సిరంజి ఏకకాలంలో అందరూ వాడటం వల్ల ఒకరికి ఉన్న వ్యాధి తక్కిన వాళ్ళకి సంక్రమించే అవకాశం ఉంది. సూదులు వాడకం ఉండకపోతే మామూలుగా వాడే మాదక పదార్థాల వల్ల హెచ్.ఐ.వి. కలగదు. మీకు ఇతరులతో లైంగిక సంబంధాలు, ఒకే సుదివాడటం లేదు కనుక హెచ్.ఐ.వి. రాదు. అయినా గంజాయి అలవాటు పనికిరాదు. అది మీ ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొడుతుంది. ఎయిడ్స్ ఎంత నష్టదాయకమో గంజాయి అలవాటు కూడా అంతగానే ప్రమాదకరం.