ప్రశ్న:- ”వేడి చేస్తే కడుపులో మంట, నొప్పి వస్తాయా? వేడి తగ్గాలంటే ఏం తీసుకోవాలి?”
జవాబు:- వేడి అనే మాటకి అర్థం లేదు. వేడి అనుకునే దానికి ఏదో ఒక అనారోగ్య కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికీ జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఆకలి అనిపించడానికి, ఆహారం జీర్ణం అవడానికి ఈ యాసిడ్ అవసరం ఉంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో పాటు, సెప్సిన్, మ్యూకస్ కూడా తయారవుతుంది. ఇవన్నీ సమపాళ్ళల్లో ఉత్పత్తి అయితే యాసిడ్ వల్ల ఎటువంటి బాధ అనిపించదు. అవసరమైన దానికంటే అధికంగా యాసిడ్ తయారైనప్పుడే కడుపులో మంట, నొప్పి బాధలు తలెత్తుతాయి.
జీర్ణాశయంలో అధికంగా యాసిడ్ తయారవడానికి కాఫీ-టీలు అధికంగా సేవించడం, మానసిక ఒత్తిడికి గురికావడం, నిద్ర లేకపోవడం, పులుపు, కారం, మసాలాలు అధికంగా తీసుకోవడం, మద్యం సేవించడం, ధూమపానం చేయడం, పాన్ పరాగ్‌లు, జర్దాలు తినడం ప్రధాన కారణాలు. అందుకని ఆహారం, అలవాట్లు విషయంలో జాగ్రత్త, కడుపులో మంట, నొప్పి నివారణకి అత్యంత అవసరం.
కడుపులో మంట ఉంటే చలవ చేయడానికి కొందరు నిమ్మరసం, జింజిర్ తీసుకుంటారు. నిజానికి దానివల్ల మంట మరింత ఎక్కువ అవుతుంది.
కడుపులో మంట ఎక్కువగా ఉన్నప్పుడు జెలూసిల్, డైజిన్ వంటి బిళ్ళలు 1-2 చొప్పున రోజుకి 4-5 సార్లు చప్పరిస్తే తగ్గిపోతుంది. మంట ఎక్కువ ఉన్నప్పుడు ఒమేజ్-డి క్యాప్సూల్ రోజుకి 1-2 వేసుకోవాలి. లేదా రాబిప్రజోల్, పాంటోప్రజీల్ బిళ్ళలు రోజుకి 1-2 వాడాలి. దాంతో బాధ తగ్గిపోతుంది. తరచూ కడుపులో మంట, నొప్పి కలుగుతూ ఉంటే ఎండోస్కోపీ చేయించుకుని కడుపులో పుండు ఉందేమో నిర్థారణ చేసుకోవాలి.