ప్రశ్న:- ”నా వయస్సు 60 సంవత్సరాలు. మా వారి వయస్సు 70 సంవత్సరాలు. మా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం పది సంవత్సరాల నుంచి లేదు. నాకు దాని మీద ఎటువంటి ఆసక్తీ లేదు. గత కొద్ది నెలలుగా మా వారి ధోరణి చాలా వింతగా ఉంది. నాకు పరాయి పురుషులతో లైంగిక సంబంధాలు ఉన్నాయని తెగ గోలపెడుతున్నారు. ఇంట్లో కోడళ్ళు, పెళ్ళీడుకు వచ్చిన మనవరాండ్రు ఉన్నారు. అదేమీ పట్టించుకోకుండా చాలా అసహ్యంగా నన్ను నానా మాటలు అంటున్నారు. నేను ఏ పాపం ఎరగను. నలుగురి ముందు సెక్సు గురించి చాలా హీనంగా మాట్లాడటంతో సిగ్గుతో తలవంచుకుంటున్నాను. ఏమీ లేదని అందరికీ తెలుసు. అయినా ఆయన మాత్రం వీళ్ళతో, వాళ్ళతో నాకు సంబంధాలు అంటగట్టేసి చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో తప్ప తక్కిన విషయాల్లో బాగానే ఉంటున్నారు. ఆయన ధోరణి మారేదెలా? నా బ్రతుకు మారేదెలా?”
జవాబు:- మీ వారిలో సైకోటిక్ డిజార్డర్ ఏర్పడ్డట్టుంది. దానివల్ల వారిలో భ్రమలు, భ్రాంతులు కలుగుతున్నాయి. ఇది ఒక మెంటల్ డిసీజ్. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళల్లో కొందరిలో ఇలా మాట్లాడటం కనబడుతుంది. అది ఆడవాళ్ళల్లోనూ రావచ్చు. మగవాళ్ళల్లోనూ రావచ్చు. సైకోటిక్ డిజార్డర్ తగ్గడానికి మందులు వాడితే తిరిగి మామూలు అవుతారు. మీ వారిని డాక్టరుకి చూపించి మందులు వాడండి. మీ బతుకు తప్పకుండా బాగుపడుతుంది.