ప్రశ్న:- ”నా వయస్సు 20 సంవత్సరాలు. అంగం ఒక ప్రక్కకి వంగి ఉంటుంది. స్తంభించినప్పుడు కూడా అటు ప్రక్కకే లాగేసినట్టు అవుతుంది. అంగం ఎప్పుడూ తిన్నగా ఉండాలట కదా. ఇలా ప్రక్కకి వంగి ఉంటే వైవాహిక జీవితానికి పనికి రారని విన్నాను. నేను చాలాసార్లు చేత్తో తిన్నగా లాగి పట్టుకున్నాను. అయినా తిన్నగా మారలేదు. పైగా స్తంభించినప్పుడు గట్టిగా రెండో ప్రక్కకి లాగితే నొప్పి కూడా అనిపిస్తుంది. సెక్స్ స్పెషలిస్ట్ అని బోర్డు కట్టుకునే ఒక డాక్టరు దగ్గరికి వెళ్ళాను. అతను నన్ను పరీక్షచేసి అంగం ఇలా ఉంటే సెక్స్‌కి పనికిరావని, అంగప్రవేశం జరగదని, అంగం తిన్నగా ఉన్నప్పుడే అంగప్రవేశం కుదురుతుందని చాలా వివరంగా చెప్పాడు. అయిదు వేల రూపాయలిస్తే ఒక వ్యాక్యూమ్ పంప్ ఇస్తానన్నాడు. దాంట్లో అంగాన్ని పెట్టుకుని గాలి కొట్టుకుంటే అంగం తిన్నగా అవుతుందన్నాడు. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ఈ విషయం పెద్దలకి చెప్పుకోడానికి సిగ్గు వేసింది. చెల్లి పెళ్ళి కోసం నాన్న డబ్బులు దాస్తే అందులో నుంచి పది వేలు దొంగిలించాను. వ్యాక్యూమ్ పంప్ వాడినప్పటికీ అంగం స్తంభించినప్పుడు ఒక ప్రక్కకి వంగుతూనే ఉంది. దీనికోసం ఏమైనా ఆపరేషన్ చేయాలా? దాంపత్య జీవితానికి పనికి రాకపోతే ఇక ఈ బ్రతుకు ఎందుకు? మీరే మార్గం చూపాలి. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. నేను బ్రతుకుండేది, చనిపోయేది మీరిచ్చే సమాధానం మీదే ఆధారపడి ఉంది. నా ఆవేదనని అర్ధం చేసుకోండి.”
జవాబు:- మీకున్న వంకర, వంకర కానేకాదు. పురుషాంగం నేలలో పాతేసిన పుల్లలాగ తిన్నగా ఉండదు. అందులోనూ స్తంభించినప్పుడు అసలే ఉండదు. అది ఎటు ప్రక్కకి వంగి ఉన్నప్పటికీ అంగప్రవేశానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ ప్రక్కకి వంగి ఉన్నట్టు అనిపించినా దాంపత్య జీవితంలో పాల్గొన్నప్పుడు చేత్తో కాస్తగైడ్ చేసుకుంటే సులువుగా అంగప్రవేశం జరుగుతుంది. అందుకని అంగం వంకర అనే దిగులు అనవసరం. ఎటువంటి వైద్య విజ్ఞానం లేని నకిలీ వైద్యులు సెక్స్ స్పెషలిస్టులుగా ప్రచారం చేసుకుంటూ మీలాంటి అమాయకుల బ్రతుకులతో వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ వలలో చిక్కుకోకూడదు. మీకు ఎటువంటి చికిత్స అవసరం లేదు. నిర్భయంగా పెళ్ళి చేసుకోండి.