ప్రశ్న:- ”నాకు ఎయిడ్స్ ఉంది. సిడి4 130 ఉంది. తరచుగా విరోచనాలు అవుతున్నాయి. విరోచనాలు అయినప్పుడల్లా మందుల దుకాణంలో బిళ్ళలు కొని వేసుకుంటున్నాను. కానీ తగ్గడం లేదు. ఎయిడ్స్ వల్ల ఇతర బాధలు ఏవీలేవు కాని విరోచనాలే ప్రాణం తీసేస్తున్నాయి. బాగా నీరసపడ్డాను. మందులు ఏవి వాడాలి?”
జవాబు:- ఎయిడ్స్ రోగిలో విరోచనాలు అవడం అతిసాధారణ విషయం. సిడి4 కౌంట్ 200 కంటే తక్కువ అయిన వాళ్ళల్లో విరోచనాలు తరచూ కనబడతాయి. జీర్ణకోశం ప్రేగుల్లో పేరాసైట్స్, బాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏవి చోటుచేసుకున్నా విరోచనాలు అవుతాయి. ఎయిడ్స్ రోగిలో వీటిల్లో ఏవో ఒకటి జీర్ణకోశం ప్రేగుల్లో స్థావరం ఏర్పరచుకోవడం సహజం. విరోచనం పరీక్ష చేస్తే ఏమైనదీ కొంతవరకు తెలుసుకోవచ్చు. కారణం బట్టి చికిత్స చేస్తే ఫలితం తృప్తికరంగా ఉంటుంది. మంచినీళ్ళు కాచి చల్లార్చి తాగుతుంటే పై ఇన్ఫెక్షన్లు అంత తేలికగా సంభవించవు. అందుకని ఎయిడ్స్ రోగి అందరిలాగా కొళాయిల్లో, నూతుల్లో నీళ్ళు నేరుగా తాగకూడదు. కాచి చల్లార్చినవే తాగాలి. చేతులు ఎప్పుడూ శుభ్రంగా కడుక్కునే భుజించాలి. తినే పదార్థాల మీద ఈగలు, దోమలు వాలకూడదు. జామకాయలు, ద్రాక్షపళ్ళు యాపిల్స్ మొదలైనవి శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ఇలా చేస్తే చాలా వరకు విరోచనాలు అవవు.
ఎక్కువ మందిలో బాక్టీరియా క్రిముల వల్ల ఇన్ఫెక్షన్లు అవుతాయి. వాటి నివారణకి విరోచనాలు అవుతున్నప్పుడు సిప్రోప్లాక్సాసిన్ 500 ఎం.జి. బిళ్ళలు ఉదయం-1, సాయంత్రం-1 చొప్పున విరోచనాలు తగ్గేవరకూ వాడాలి. విరోచనాలు తగ్గిన తర్వాత కూడా ఇంకో రెండు రోజులు వాడాలి. విరోచనాలతోపాటు కడుపులో మెలినొప్పి ఉంటే లోపర్మైడ్ బిళ్ళలు వాడాలి. కడుపులో పురుగులు చేరడం కూడా సాధారణ విషయమే కనుక తరచూ విరోచనాలు అయ్యే వాళ్ళు అల్బెండజోల్ 400 ఎం.జి. బిళ్ళలు ఉదయం-1, సాయంత్రం-1 చొప్పున 2 వారాలు వాడాలి. మందులు వాడటమే కాకుండా పౌష్టికాహారం విషయంలో శ్రద్ధ వహించాలి. పప్పులు, గుడ్లు, ఆకు కూరలు తీసుకోవాలి. విరోచనాలు అవుతున్నప్పుడు కాచి చల్లార్చిన నీళ్ళల్లో ఉప్పు, పంచదార కలిపి తాగాలి. ఈ రకంగా చేస్తే విరోచనాలు సమస్య సాధారణంగా ఉండదు. విరోచనాలు వల్ల ఆరోగ్యం క్షీణించదు. మీ ఫ్యామిలీ డాక్టరుని సంప్రదించి సరైన చికిత్స పొందండి. అంతేగాని మందుల దుకాణంలో ఏవేవో బిళ్ళలు కొనుక్కుని వేసుకోవడం కాదు.