ప్రశ్న:-”మా బంధువు ఒకరికి హెచ్.ఐ.వి. ఉంది. అతనికి నిదానంగా చూపు తగ్గిపోయి చివరికి అంధత్వం ప్రాప్తించింది. అతను కుర్రవాడే. అంధత్వం రావడానికి హెచ్.ఐ.వి. వ్యాధే కారణమా? అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనికి కూడా అంధత్వం వచ్చింది. మరి అతనికి హెచ్.ఐ.వి. ఉందో లేదో తెలియదు. ఎయిడ్స్ అంటువ్యాధా? కాదా? ఎయిడ్స్ ఉన్న వ్యక్తితో కలిసి ఉంటే తక్కిన వాళ్ళకి కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుందా? స్నేహితునికి కూడా అంధత్వం రావడం అంటువ్యాధి వల్ల కాదా?”
జవాబు:- ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. ఆ వ్యాధి ఉన్న వాళ్ళతో సెక్స్‌లో పాల్గొనడం లేదా వాళ్ళ రక్తం పరీక్ష చేయకుండా ఎక్కించుకోవడం లేదా వాళ్ళు వాడిన సూదులతోనే ఇంజక్షన్‌ను చేయించుకోవడం లేదా తల్లి నుంచి బిడ్డకి రావడమే తప్ప మరొక విధంగా రాదు. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన కొందరిలో కొన్ని రకాల కంటివ్యాధులు కలిగి అంధత్వం ప్రాప్తించే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందితే అంధత్వం కలిగే అవకాశం లేదు. ఆ స్నేహితునికి చిన్న వయస్సులోనే అంధత్వం కలిగిందంటే ఎయిడ్స్ వల్లనా, మరొక కారణమా అనేది పరీక్షించి తేల్చవలసిన విషయం. ఎయిడ్స్ మాత్రం అంటువ్యాధి కాదు. అందువల్ల ఎయిడ్స్ సోకిన వ్యక్తితో మామూలుగా కలసి మెలసి ఉండవచ్చు. భయం ఏమాత్రం అవసరం లేదు.