ప్రశ్న:- ”మా వారికి గతంలో చాలామందితో సంబంధాలుండేవి. నేను అదుపు చేసినా, మా మధ్య ఉన్న సున్నితమైన అంశాలరీత్యా పూర్తిగా అడ్డుకోలేకపోయాను. మూడేళ్ల క్రితం ఆయనకు ఒకామెతో సంబంధం ఏర్పడింది. ఆమె మాత్రం ఆయన మిగతా సంబంధాలను కట్టడి చేయగలిగింది. అందువల్ల ఆమెతో సంబంధాన్ని నేను అడ్డుకోలేకపోయాను. ఆమె వివాహిత, భర్త ఉన్నాడు. మొదట్లో బాగానే ఉన్నా, ఈ మధ్య ఆమెతో ఉండి వచ్చి, నాతో ఉంటున్న తర్వాత, ఆయన అంగంపై నీటి పొక్కులలాగ వస్తున్నాయి. మంట ఉంటుందన్నారు. ఏ మందులూ వాడకుండానే వారం పదిరోజుల్లో తగ్గిపోతున్నాయి. ఆయన తరచూ కాళ్ల నొప్పులు అంటున్నారు. నాకూ ఈ మధ్య కాళ్లనొప్పులు వస్తున్నాయి. కారణాలు చెప్పగలరు.”
జవాబు:- పరాయి స్త్రీలతో లైంగిక సంబంధాలు ఉన్నప్పుడు కొందరికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సంక్రమిస్తాయి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. అక్రమ సంబంధాలు కలిగి ఉన్న స్త్రీలకి ఒక్కొక్కసారి భర్తతోనే కాకుండా మరికొందరు ఇతర పురుషులతో కూడా సంబంధాలు ఉండవచ్చు. ఆమె భర్తకు కూడా ఇతర స్త్రీలతో సంబంధాలు ఉండవచ్చు. ఆ విధంగా చిన్నవో, పెద్దవో లైంగిక వ్యాధులు కలుగుతాయి. అదే విధంగా మీ వారికి పరాయి స్త్రీ నుంచి బాక్టీరియా ఇన్ఫెక్షన్లు గాని, వైరల్ ఇన్ఫెక్షన్లుగాని సంక్రమించవచ్చు. భార్యాభర్తల మధ్య పూర్తి కమ్యూనికేషన్స్ ఉండాలి. మనస్సువిప్పి మాట్లాడటం ఉన్నప్పుడు చాలా వరకు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఉండదు. మీ వారితో మీరు మనస్సు విప్పి మాట్లాడండి. సంఘర్షణ రూపంలో కాకుండా సమస్య పరిష్కారం రూపంలో మాట్లాడండి. ఆయనకు పరాయి స్త్రీతో సెక్స్‌లో పాల్గొనే విషయంలో మార్పు లేకపోతే కనీసం మీతో పాల్గొన్నప్పుడు కండోమ్ వాడమని కోరండి. దాంతో చాలావరకు వ్యాధుల సమస్య ఉండదు. కాళ్ళనొప్పుల విషయంలో ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. లైంగిక వ్యాధులకు కాళ్ళనొప్పులకు సంబంధం ఉన్నదీ లేనిదీ తేల్చుకోండి. ఏదేమైనప్పటికీ మందులు వాడకంతో కాళ్ళనొప్పులు తగ్గుతాయి.