ప్రశ్న:- ”మా ఇద్దరికీ హెచ్.ఐ.వి ఉంది. ఇద్దరికీ వ్యాధి ఇంకా ముదరలేదని ఎఆర్‌వి మందులు అప్పుడే వాడనవసరం లేదని చెప్పారు. కేవలం బలానికి మందులు ఇస్తున్నారు. మంచి ఆహారం తీసుకోమని చెప్పారు. ప్రస్తుతానికి ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాము. ఇటీవలనే మా ఆవిడ ప్రసవించింది. మా బాబుకి కూడా హెచ్.ఐ.వి ఉందని నిర్థారణ చేశారు. వాడికి కూడా ఇప్పటి నుంచే మందులు వాడాలా లేక పెద్దయిన తర్వాతే మందులు మొదలుపెట్టాలా?”
జవాబు:- పెద్దవాళ్ళలో హెచ్.ఐ.వి. ఉన్నప్పటికీ సిడి-4 కౌంట్ 200కి పడిపోయే వరకు లేదా ఎయిడ్స్ లక్షణాలు ఏర్పడే వరకు ఎఆర్‌వి మందులు వాడరు. చిన్నపిల్లల విషయంలో హెచ్.ఐ.వి. ఉందని పరీక్షలో నిర్థారణ అయితే వయస్సు, వ్యాధి లక్షణాలతో నిమిత్తం లేకుండా ఎఆర్‌వి (యాంటీ రిట్రో వైరల్ డ్రగ్స్) వాడాలి. ట్రై డాట్ టెస్ట్ లేదా ఎలీజా టెస్ట్ చేసి అందులో పాజిటివ్ వస్తే ఎయిడ్స్ ఉందని నిర్థారణకి రాకూడదు. 18 మాసాలు నిండిన తర్వాత కూడా ఆ బిడ్డలో ట్రైడాట్ లేదా ఎలీజా పాజిటివ్ వస్తేనే హెచ్.ఐ.వి. ఉన్నట్టుగా నిర్ధారణ చేయాలి. అలా కాకుండా బిడ్డ పుట్టగానే గాని లేదా ఆరవ వారంలో, 3వ నెలలో, ఆరవ నెలలో పిసిఆర్ టెస్ట్ చేస్తూ టెస్ట్ పాజిటివ్ వస్తే కనుక అప్పటి నుండి ఆ బిడ్డకి ఎఆర్‌వి మందులు మొదలుపెట్టాలి. దాంతో బిడ్డ ఆరోగ్యం మరింత బాగుంటుంది. ఎయిడ్స్ లక్షణాలు ఏర్పడవు.