ప్రశ్న:- ”నాకు హెచ్.ఐ.వి. ఉంది. మా ఆవిడకి ఉంది. ప్రస్తుతం ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం. సెక్స్‌లో పాల్గొనే సామర్థ్యం కూడా చక్కగానే ఉంది. డాక్టరు సలహా మేరకు యాంటి రిట్రోవైరల్ డ్రగ్స్ కూడా వేసుకుంటున్నాను. మేము సెక్స్‌లో పాల్గొనవచ్చని చెప్పి కండోమ్ మాత్రం తప్పక వాడాలని డాక్టరు చెప్పారు. మా ఆవిడకి పిల్లలు పుట్టకుండా ఎప్పుడో ట్యూబెక్టమీ అయిపోయింది. ట్యూబెక్టమీ అయిందని తెలియక బిడ్డకి ఈ జబ్బు వస్తుందేమోనని డాక్టర్ కండోమ్ వాడమని చెప్పారా? మీరే మా సందేహం తీర్చాలి. ఇద్దరికీ హెచ్.ఐ.వి. ఉన్నప్పుడు ఇక కండోమ్ వాడవలసిన అవసరమేమిటి?”
జవాబు:- భార్యాభర్తలిద్దరికీ హెచ్.ఐ.వి./ఎయిడ్స్ ఉన్నప్పటికీ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తప్పకుండా కండోమ్ వాడాలి. హెచ్.ఐ.వి. దంపతుల విషయంలో కండోమ్ వాడమని చెప్పడం పిల్లలు పుట్టకుండా ఉండటానికి కాదు. నేరుగా సెక్స్‌లో పాల్గొంటే ఒకరిలోని హెచ్.ఐ.వి. క్రిములు మరొకరికి ఎక్కువ చేరిపోతాయి. ముఖ్యంగా పురుషుడి వీర్యం ద్వారా ఎక్కువ వైరల్ క్రిములు స్త్రీలో చేరతాయి. దాంతో ఆమెలో వైరల్ లోడ్ త్వరితంగా పెరిగిపోయి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. యాంటి రిట్రోవైరల్ డ్రగ్స్ వాడుతున్నప్పటికీ వ్యాధిక్రిములు పూర్తిగా నిర్మూలింపబడవు. మందులకి లొంగని మ్యూటెంట్ లేదా రెసిస్టెంట్ వైరస్ తయారవుతూ ఉంటాయి. ఇవి హెచ్.ఐ.వి. ఉన్న ఇద్దరిలోనూ తయారవుతూ ఉంటాయి. కండోమ్ లేకుండా పాల్గొంటే ఈ రెసిస్టెంట్ వైరస్ కూడా తయారవుతాయి. ఇవి మందులకి లొంగవు సరికదా వీటి జాతి కూడా ఎక్కువ అవుతాయి. ఇలాంటి రెసిస్టెంట్ వైరస్ కండోమ్ వాడితే ఒకరి నుంచి మరొకరికి సంక్రమించవు. ఎవరివి వారిలోనే ఉంటాయి. రెండవ వారివి కూడా రెట్టింపు అవవు. అందుకని ఇద్దరికీ హెచ్.ఐ.వి. ఉన్నప్పటికీ మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధి ముదరకుండా ఉండటానికి హెచ్.ఐ.వి. దంపతులు పాల్గొనప్పుడు కండోమ్ తప్పకుండా వాడాలి.