ప్రశ్న:- ”నా వయస్సు 72 సంవత్సరాలు. ఎక్కువసార్లు మూత్రం వస్తుంది. కాని షుగర్ లేదు. ఇప్పటికీ నాకు సెక్స్ సామర్థ్యం ఉంది. 4-5 రోజులకి ఒక్కసారి సెక్స్‌లో పాల్గొంటూనే ఉంటాను. సెక్స్‌లో పాల్గొన్న రోజున రాత్రిపూట ఇంకా 2-3 సార్లు అదనంగా మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. నా బాధని స్నేహితునితో చెప్పుకుంటే ఈ వయస్సులో కూడా సెక్స్‌లో పాల్గొనడం వల్లే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళవలసి వస్తుందని చెప్పారు. సెక్స్ నరాలు బలహీనం కావడమే ఇందుకు కారణం అన్నాడు. ఆయన ఏనాడో సెక్స్‌కి గుడ్‌బై చెప్పాడట. ఏ బాధలూ లేవట. నేను కూడా సెక్స్‌కి గుడ్‌బై చెప్పాలా?”
జవాబు:- వృద్ధాప్యం మీద పడ్డప్పటికీ సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎటువంటి వ్యాధులూ రావు. బలహీనతలూ కలగవు. సెక్స్ సామర్థ్యం ఉంటే వయస్సు ఎంత మీద పడ్డప్పటికీ దాంపత్య జీవితంలో పాల్గొనవచ్చు. మీలో మూత్రం ఎక్కువసార్లు రావడానికి ప్రొస్టేటు గ్లాండు పరిమాణం పెరగడం కారణం. దీన్నే బి.పి.హెచ్ (బినైన్ ప్రోస్టేట్ హైపర్‌ట్రఫి) అంటారు. 50-60 సంవత్సరాలు దాటిన చాలామందిలో బి.పి.హెచ్ ప్రాబ్లమ్ కొద్దో గొప్పో ఉంటుంది. బి.పి.హెచ్ వల్ల కొందరిలో ఎక్కువసార్లు మూత్రం రావడం ఉండగా మరికొందరిలో ఎక్కువసార్లు మూత్రం సన్నటి ధారగా రావడం, ఎక్కువసేపు మూత్రం పోయవలసిన పరిస్థితి ఏర్పడటం, చివరిలో చుక్కలు చుక్కలుగా ఎక్కువ సేపు పడటం ఉంటుంది. బి.పి.హెచ్ బాధ ఎక్కువగా ఉన్నప్పుడు కొందరికి సర్జరీ కూడా అవసరం అవుతుంది. బి.పి.హెచ్ మొదటి దశలో మందు బిళ్ళలతో చాలావరకు బాధా నివృత్తి చేయవచ్చు. బి.పి.హెచ్ ఉన్నప్పటికీ సెక్స్‌లో పాల్గొనవచ్చు. బి.పి.హెచ్ ఉన్న వాళ్ళల్లో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ప్రోస్టేటు గ్రంథి కంజెషన్ మరింత పెరిగి 1-2 సార్లు అధికంగా మూత్రం రావచ్చు. అంతేతప్ప ఎటువంటి నష్టం లేదు. మీ స్నేహితుడు ఇచ్చిన సలహా సరైనది కాదు. ప్రోస్టేటు పరిమాణం పెరుగుదల గురించి ఒకసారి డాక్టరుకి చూపించుకోండి.