ప్రశ్న:-”నా వయస్సు 29 సంవత్సరాలు. నాకు ఒక సమస్య ఉంది. అదేమిటంటే నా వయస్సుకు ఉండవలసినట్టుగా గెడ్డం, మీసం లేవు. ఇంకా నూనుగు మీసాలే ఉన్నాయి. అంగస్తంభనలు మాత్రం చక్కగా ఉన్నాయి. ప్రస్తుతం నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. పెళ్ళైతే నాతో భార్య తృప్తి చెందగలదా? లేదా? నాకు గెడ్డాలు, మీసాలు రావాలంటే ఏం చేయాలి?”
జవాబు:-కొందరికి వయస్సుకి తగ్గట్టు గెడ్డాలు, మీసాలు రాకపోయినప్పటికీ సెక్స్‌పరంగా మర్మావయవాలు పర్‌ఫెక్ట్‌గా పెంపొందుతాయి. సెక్స్ కోరికలు చక్కగా ఉంటాయి. అంగస్తంభనలు, సెక్స్ స్పందనలు మామూలుగానే ఉంటాయి. ఇటువంటి వాళ్ళు గెడ్డాలు, మీసాలు సరిగా రాలేదని ఏమాత్రం దిగులు చెందనవసరం లేదు. ధైర్యంగా పెళ్ళి చేసుకోవచ్చు. కొందరిలోనే వృషణాలు తగినంత ఎదగకపోవడం, పురుషాంగం పెరగకపోవడం, గెడ్డాలు, మీసాలు రాకపోవడం ఉంటాయి. ఇటువంటి వాళ్ళల్లో సెక్స్ హార్మోను లోపం ఉంటుంది. వీళ్ళకి సెక్సు హార్మోన్లకి సంబంధించిన ఇంజక్షన్లు లేదా బిళ్ళలు వాడితే మర్మావయవాలు పెరగడం, గెడ్డాలు – మీసాలు రావడం జరుగుతుంది. అంగస్తంభనలు చక్కగా ఉండి గెడ్డాలు, మీసాలు రాని వాళ్ళల్లో జీన్స్ లోపం ఉంటుంది గాని సెక్స్ హార్మోన్ల లోపం ఉండదు. జీన్స్ లోపం వల్ల గెడ్డాలు, మీసాలు రానివాళ్ళకి చేయగలిగిందేమీ లేదు. అంగస్తంభనలు, సెక్సు సామర్థ్యం చక్కగా ఉన్నప్పుడు గెడ్డాలు, మీసాలు లేవని దిగులు చెందడం అనవసరం. అందుకని మీ విషయంలో ఎటువంటి ఆలోచనా వద్దు. నిరభ్యంతరంగా పెళ్ళి చేసుకోండి. మందులేమీ అవసరం లేదు.