ప్రశ్న:- ”నేను గర్భవతి, మొన్ననే చంద్రగ్రహణం వచ్చింది కదా. ఆ సమయంలో నన్ను బయటకి వెళ్ళవద్దని అమ్మ ఎంతగానో వారించింది. కాని గ్రహణం చూడాలని నాకెంతో అనిపించింది. సూర్యగ్రహణంగాని, చంద్రగ్రహణంగాని వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే పుట్టే బిడ్డలకు అంగవైకల్యం వస్తుందని అమ్మ చెప్పింది. అది నిజమేనా?”
జవాబు:- గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో ఇంట్లోంచి బయటికి వచ్చి గ్రహణాన్ని చూస్తే నష్టమేమీ లేదు. గ్రహణం సమయంలో గర్భిణీ బయట తిరగడం వల్ల గర్భస్థ శిశువుకి ఎటువంటి అంగవైకల్యం రాదు. గ్రహణం సమయంలో సూర్యుడి నుంచి గాని, చంద్రుడి నుంచి గాని ప్రత్యేకంగా ఎటువంటి కిరణాలు వెలువడవు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడతాయి. గ్రహణం సమయం అయినప్పటికీ ఎప్పుడూ ఉండే సూర్యుడే, ఎప్పుడూ ఉండే భూమే, ఎప్పుడూ ఉండే చంద్రుడే. అంతే గాని వేరే మార్పులు లేవు. అలాగే రాహు, కేతువులు గ్రహణ సమయంలో చంద్రుడ్ని, సూర్యుడ్ని మింగుతాయనేవి కట్టుకథలే తప్ప నిజం కాదు. గ్రహణం సమయంలో బయటకు రాకూడదనేది, ఏవీ తినకూడదు, తాగకూడదనేవి అర్థంలేని మాటలు. గ్రహణాల గురించి మూఢనమ్మకాలని విడనాడాలి.