ప్రశ్న:-”ఇటీవల నేను చాలా నీరసపడ్డాను. డాక్టరుకి చూపిస్తే హెచ్.ఐ.వి. ఉందని చెప్పారు. నా బ్రతుకు అయిపోయినట్టేనా? ఇక నేను ఎంత కాలం బ్రతుకుతాను?”
జవాబు:- హెచ్.ఐ.వి. వచ్చినంత మాత్రాన బ్రతుకు ముగిసినట్టు కాదు. బి.పి., షుగర్ వ్యాధులు లాగానే ఇది కూడా ఒక దీర్ఘకాల వ్యాధి. బి.పి., షుగరు వ్యాధులకి మందులు వాడుతూ ఉంటే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగానే హెచ్.ఐ.వి. కూడా ముదరకుండా నిలకడగా ఉంటుంది. అయితే ఆరోగ్య సూత్రాలని పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ పనికిరావు. మానసికంగా ప్రశాంతగా ఉండాలి. ఎక్కువ అలసిపోకూడదు. రాత్రిపూట కనీసం 6 గంటలు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన పరిసరాలలో జీవించాలి. అవసరం బట్టి యాంటీ రిట్రోవైరల్ (ఎ.ఆర్.వి.) మందులు వాడాలి. ఈ మందులు సిడి-4 కణాలు 200 కంటే తక్కువ ఉన్నప్పుడే ప్రారంభించాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఎ.ఆర్.వి. మొదలు పెట్టనవసరం లేదు. పైవిధంగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, ఎ.ఆర్.వి. మందులు వాడవలసిన సమయం వచ్చినప్పటి నుంచి వాటిని వాడితే 15-20 సంవత్సరాల పాటు ఎటువంటి ఢోకా లేకుండా హాయిగా ఉండవచ్చు. కొద్ది సంవత్సరాల్లో ఎలాగూ పూర్తిగా నయం చేయగల మందులు వస్తాయి. అందుకని దిగులు చెందకండి.