ప్రశ్న:- ”మా ఇంట్లో ఎయిడ్స్ రోగి ఉన్నాడు. మేము అతనికి ఎంతో సానుభూతితో సేవలన్నీ అందిస్తున్నాం. అయినప్పటికీ అతను ఎంతో డిప్రస్యివ్గా కనబడేవాడు. ఇటీవల అతనిలో ఆవేశం, ఉద్రేకం ఎక్కువ కనబడుతున్నాయి. మేము అతనికి ఏదో హాని తలపెట్టినట్టు, అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నాడు. మా మీద కోపంతో విరుచుకు పడుతున్నాడు. ఎంతో ప్రేమగా చూస్తున్నప్పటికీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. ఏం చేయాలి?”
జవాబు:- హెచ్.ఐ.వి. వచ్చిన వాళ్ళల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సహజంగా కలుగుతాయి. వ్యాధి ముదిరిన తర్వాత సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చోటు చేసుకుంటాయి. ఇటువంటి మానసిక జబ్బుల్లో డిప్రషన్, డిమెన్షియా, సైకోసిన్లు ముఖ్యమైనవి. హెచ్.ఐ.వి. సోకక ముందే ఏ వ్యక్తిలో అయినా మానసిక జబ్బులు ఉంటే అవి మరింత ఎక్కువ అవుతాయి. హెచ్.ఐ.వి. ఉన్నవాళ్ళలో డిప్రషన్ ఎక్కువగా కనబడుతుంది. అది వస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మతిమరుపు రావడం, శక్తిలేనట్లు ఫీలింగ్, ఆకలి తగ్గిపోవడం ఉంటాయి. డిప్రషన్ తగ్గడానికి మందులు వాడితే రోగి తేలికగా కోలుకుంటాడు.
హెచ్.ఐ.వి./ఎయిడ్స్ రోగులు కొందరు సైకోటిక్‌గా (మెంటల్‌గా) కూడా మారతారు. సైకోటిక్‌గా మారిన వ్యక్తుల్లో మానసిక ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఇన్హిబిషన్స్ ఉండవు. భ్రమలు, భ్రాంతులు కలుగుతాయి. ఆలోచనలు విలక్షణంగా ఉంటాయి. మానసిక రోగులుగా ప్రవర్తిస్తారు. యాంటి సైకోటిక్ డ్రగ్స్‌తో చికిత్స చేస్తే మామూలు అవుతారు. అందుకని హెచ్.ఐ.వి./ఎయిడ్స్ రోగుల్లో వచ్చిన మానసిక మార్పులని మొదట్లోనే గమనించి సరైన మానసిక చికిత్స అందిస్తే డిప్రషన్, సైకోసిస్ రాకుండా నివారించవచ్చు. హెచ్.ఐ.వి. రోగి కుటుంబ సభ్యులు ప్రేమగా చూడటంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యం ఎడల కూడా శ్రద్ధ వహించాలి.