ప్రశ్న:- ”నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఇంతవరకు మా ఆవిడకు గర్భం రాలేదు. ఆవిడకు పిల్లలు కావాలని ఎంతో తహతహ ఉంది. ఇటీవల ఆవిడ అందరితో అనే మాటలు వింటూ ఉంటే నాకు మతిపోతోంది. గర్భం రావాలంటే సెక్స్‌లో పాల్గొనప్పుడు మగవాని నుంచి వీర్యం రావాలని, నానుంచి అలా వీర్యం రావడం లేదని ఆవిడ గట్టిగా చెబుతోంది. నా మటుకు నాకు వీర్యస్ఖలనం అవడం స్పష్టంగా తెలుస్తుదంది. కాని ఆవిడ మాత్రం నాకు వీర్యస్ఖలనం కావడం లేదంటుంది. అందుకని గర్భం రావడం లేదంటుంది. వీర్యస్ఖలనం అయితే యోనిలోపల వెచ్చగానో, చల్లగానో తెలియాలి కదా. తనకి అటువంటి అనుభూతి ఏ మాత్రం లేదంటుంది. పైగా వీర్యం పడితే యోని బయట గోడ బాగా తడవాలి కదా. అది కూడా జరగడం లేదంటుంది. నావల్ల తను ఈ జన్మలో తల్లిని కాలేను అంటుంది. ఈ మాటలు వింటూ ఉంటే నా తల కొట్టేసినట్టు అవుతుంది. రైలు కింద తలపెట్టి చావాలని ఉంది. అసమర్థ మొగుడ్ని అనే మాట భరించలేకపోతున్నాను. నాకు వీర్యస్ఖలనం అయినప్పుడు ఆవిడకి తెలిసే విధానం చెప్పండి. మా సంసారాన్ని కాపాడండి.”
జవాబు:- పురుషుని వీర్యం యోనిలో స్ఖలింపబడినప్పుడు స్త్రీకి ఏమాత్రం తెలియదు. తడిగానో, వెచ్చగానో అనిపించదు. ఈ విషయం తెలియక మీ ఆవిడ మీకు వీర్యస్ఖలనం కావడం లేదంటోంది. వీర్యస్ఖలనం అయితే యోని బయట అంత తడిగా అవ్వాలనేది కూడా లేదు. అందుకని ఆవిడ చెప్పే ఈ మాట కూడా సరైనది కాదు. సెక్స్‌లో బాగా స్పందించే స్త్రీలలోనే యోని ద్వారం దగ్గర ద్రవాలు బాగా ఊరి యోని దగ్గర కాస్త తడి అనిపిస్తుంది. సెక్స్‌లో ఎగ్జైట్గాని స్త్రీలల్లో ద్రవాలు ఊరక తడి కూడా ఉండదు. మీ ఆవిడకి ఇంతవరకు గర్భం రాకపోవడానికి ఆమెలో లోపం ఉండవచ్చు. లేదా మీలో లోపం ఉండవచ్చు. అందువల్ల ఇద్దరూ కలిసి డాక్టరుని సంప్రదించండి. స్త్రీలల్లో అండం విడుదల లేకపోయినా లేదా పురుషుని వీర్యంలో వీర్యకణాలు తగినన్ని లేకపోయినా గర్భం దాల్చడం జరగదు. అందుకే సంతానం విషయంలో ఇద్దరూ పూర్తి పరీక్షలు చేయించుకోండి. సెక్స్ విజ్ఞానం లేనప్పుడే అనేక అపోహలు చోటు చేసుకుంటాయి. అదే మీ విషయంలో జరిగింది.