ప్రశ్న:- ”నా వయస్సు 17 సంవత్సరాలు. గత 4 సంవత్సరాలుగా రోజుకి 2-3 సార్లు హస్తప్రయోగం చేస్తున్నాను. వీర్యం పోగొట్టుకోవడం వల్ల మగవాడు సెక్స్‌కి పనికి రాకుండా అవుతాడని తెలుసు. కాని సెక్స్ పరంగా కలిగే ప్రేరణని తట్టుకోలేక ప్రతిసారీ హస్తప్రయోగం చేస్తున్నాను. అలా చేస్తే తప్ప మనస్సు శాంతించదు. చాలాసార్లు వీర్యం వచ్చేస్తుందని ఫీలింగ్ రాగానే హస్తప్రయోగం ఆపేస్తున్నాను. ఆ సమయానికి వీర్యం బయటకి రాకపోయినప్పటికీ తర్వాత డ్రాయరుకి కొంత వీర్యం అంటుకుంటోంది. ఎక్కువ పోకుండా ఆపుకున్నందుకు కాస్త సంతోషం అనిపించినా ఇటీవల చిక్కిపోతున్నాను. నా స్నేహితులు ‘ఏరా ఎందుకు చిక్కిపోతున్నావ్, హెచ్.పి. బాగా కొట్టుకుంటున్నావా, పనికి రాకుండా పోతావ్’ అని గేలి చేస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. హస్తప్రయోగం మానడం ఎలా?”
జవాబు:-హస్త ప్రయోగం గురించి భయం అనవసరం. రోజుకి ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసినా, ఎంత వీర్యం పోయినా మగవాడు నీరసపడడు. సెక్స్ బలహీనత రాదు. అంగప్రేరణ కలిగించుకుని వీర్యం పోకుండా నిరోధించడం వల్ల ఎటువంటి లాభం లేదు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత నిరంతరం వీర్యం తయారవుతుంది. తెలిసో, తెలియకుండానో వీర్యం బయటకు పోతుంది. వీర్యం పడబోయే సమయానికి ఆపుకుంటే అది బయటకు రాకుండా మూత్రకోశంలోకి వెళ్ళి మూత్రంతో కలిసి పోతుంది. దీన్నే రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటారు. మీరు వీర్యం బయటకు రాలేదని సంతోషిస్తున్నారే తప్ప అది మూత్రంతో కలసి తర్వాత బయటకు పోతుందని తెలుసుకోవడం లేదు. వీర్య నష్టం గురించి దిగులు చెందడం అనవసరం. హానికరం గాని హస్తప్రయోగం అలవాటు గురించి ఆలోచించకండి. అది మానుకోవడానికి ప్రత్యేకంగా మందులు వాడనక్కరలేదు.