ప్రశ్న:- ”నేను మా బావని ప్రేమించాను, పెళ్ళి కాకముందే శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాను. దాని ఫలితంగా గర్భం వచ్చింది. పెద్దలకు తెలిస్తే గొడవ అయిపోతుందని నాటు మంత్రసాని చేత లోపల పుల్లలు పెట్టించుకుని గర్భం పోయేటట్టు చేసుకున్నాను. బాగా రక్తం పోయింది. కడుపు నొప్పి వచ్చింది. అయినా దొంగచాటుగా చేయించుకున్న దానికి భరించాను. ఆ తరువాత కొంత కాలానికి బావతో పెళ్ళి అయింది. నాలుగేళ్ళు అయినప్పటికీ గర్భం రాలేదు. అప్పుడు అరుదుగా సెక్స్‌లో పాల్గొంటేనే కడుపు వచ్చేసింది. ఇప్పుడు రోజుకి 4-5 సార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ గర్భం రావడం లేదు. ఏమిటీ విచిత్రం?”
జవాబు:- అక్రమ గర్భస్రావాలు చేయించుకున్నప్పుడు ఇన్ఫెక్షన్లు వచ్చి గర్భాశయం అనారోగ్యంగా మారడమో, ఫెల్లోపియన్ ట్యూబులు మూసుకుపోవడమో జరుగుతుంది. దానివల్ల శాశ్వతంగా గర్భం రాకుండాపోతుంది. మీ విషయంలో అదే జరిగింది. మీకు హిస్టరోస్కోపీ చేస్తే గర్భాశయం లోపల ఎలా ఉన్నదీ, ట్యూబులు మూసుకుపోయాయో లేదో తెలుస్తుంది. దానిని బట్టి తగిన చికిత్స చేస్తే గర్భం వస్తుంది. గర్భం వద్దనుకున్నప్పుడు ఎప్పుడూ నాటు పద్ధతులతో గర్భం తీయించుకోకూడదు. శిక్షణ పొందిన డాక్టరు చేతే గర్భస్రావం చేయించుకోవాలి. ముందు గర్భం వదిలించుకుంటే చాలు తక్కినదంతా తరువాత చూసుకోవచ్చు అని తొందరపాటు చర్యలకి పాల్పడితే మీలేగా జరుగుతుంది. ట్యూబులు మూసుకుపోయిన తరువాత రోజుకి ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్నా గర్భం రాదు. మీరు వెంటనే సరైన డాక్టరుని సంప్రదించండి.