ప్రశ్న:- ”నా వయస్సు 70 సంవత్సరాలు. బి.పి., షుగర్ రెండూ ఉన్నాయి. చాలా వరకు మందులతో కంట్రోలు చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు బి.పి. పెరగడమో, షుగరు పెరగడమో జరుగుతూ ఉంటుంది. నేను రోజూ వాకింగ్ చేస్తాను. డాక్టరు చెప్పినట్టు తూ.చ. తప్పకుండా మందులు వాడతాను. నాకు ఇప్పటికీ లైంగిక సామర్థ్యం చక్కగా ఉంది. నా భార్య కూడా సహకరిస్తుంది. వారం – పదిరోజులకి ఒక్కసారైనా కలవకపోతే ఏదో అసంతృప్తి నన్ను కృంగదీస్తుంది. వాకింగ్‌లో ఉండగా నా తోటి వాకర్స్‌తో కబుర్ల మధ్య నా లైంగిక సామర్థ్యం గురించి చెపితే నేను పెద్ద తప్పు చేస్తున్నానని, ఇంత వయస్సు వచ్చాక దాంపత్యంలో పాల్గొంటే పక్షవాతం వస్తుంది, హార్ట్ ఎటాక్ వస్తుందని భయపెట్టారు. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు దాంపత్య సామర్థ్యం ఉన్నప్పటికీ లైంగిక సంబంధాలకి దూరంగా ఉండాలా? నేను చాలా తప్పు చేస్తున్నానా?”
జవాబు:- లైంగిక సామర్థ్యం ఉన్నట్టయితే వృద్ధాప్యం వచ్చినప్పటికీ దాంపత్య సంబంధాలలో పాల్గొనవచ్చు. దాంపత్యంలో పాల్గొనడానికి పక్షవాతం, హార్ట్ ఎటాక్ రావడానికి సంబంధం లేదు. సాధారణంగా వృద్ధాప్యం వచ్చిన తరువాత ఎధిరోస్ల్కి, రోసిన్, రక్తపోటు, మధుమేహం తలెత్తుతాయి. వీటివల్ల హార్ట్ఎటాక్, పక్షవాతం వస్తాయి. దాంపత్యంలో పాల్గొనటానికి, ఇవి కలగడానికి సంబంధం లేదు. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ మానసికంగా, ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటూ డాక్టరు సలహా మేరకు మందులు వాడితే బి.పి., షుగర్ వల్ల అనర్థాలు కలగడం చాలా తక్కువ. మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి దాంపత్య సంబంధాలలో పాల్గొనడం కూడా అవసరమైన ఒక అంశం. అందుకని మీరు మీ తోటి వాకర్స్ అశాస్త్రీయంగా చెప్పిన మాటలని పట్టించుకోకండి. హాయిగా దాంపత్య జీవితాన్ని ఆనందించండి.