ప్రశ్న:- ”నా వయస్సు 15 సంవత్సరాలు. ఆరు నెలల క్రితమే రజస్వల అయ్యాను. రజస్వల అయిన నెల నుంచి నాకు తెలుపు వ్యాధి మొదలైంది. ఈ విషయం అమ్మకు చెబితే వేడి చేసిందని మెంతులు నానబెట్టి పెరుగులో కలిపి తినిపించింది. అయినా తగ్గలేదు. మా మేనత్త ఒకరికి ఇలాగే తెలుపు అధికంగా కాగా ఆమెకు గర్భసంచి కేన్సరు అని తేలింది. చివరికి ఆ వ్యాధితోనే ఆమె చనిపోయింది. నా తెలుపు కూడా కేన్సరుకి దారితీస్తుందా? ఎంతో భయంగా ఉంది. నాకు తగిన పరిష్కారం తెలపండి.”
జవాబు:- రజస్వల అయిన తొలిదినాల్లో గర్భాశయం పరిమాణం పెరగడం, యోని మార్గంలో టిష్యూలు పరిపక్వత చెందడం, గ్లాండ్లు యాక్టివ్గా తయారవడంతో ఎక్కువ ద్రవాలు స్రవిస్తాయి. ఇది ఆరోగ్య లక్షణమేగాని అనారోగ్య లక్షణం కాదు. కేన్సరు లక్షణం అసలే కాదు. అందుకని మీరు భయపడనవసరం లేదు. మీ మేనత్తగారి తెలుపుకీ, మీ తెలుపుకీ సంబంధం లేదు. వేడి అనేది లేనే లేదు. వేడి తగ్గడానకి పెరుగు, మజ్జిగ తీసుకోవడం అనవసరం. మీకు ఏ మందులు అవసరం లేదు. ఏ చికిత్స అవసరం లేదు. నిర్భయంగా ఉండండి.