ప్రశ్న:- ”నాకు గత అయిదు సంవత్సరాలుగా హెచ్.ఐ.వి. ఉంది. ఇంతకాలం హెచ్.ఐ.వి. ఉన్నప్పటికీ ఏ అనారోగ్యం లేకుండా బాగానే ఉన్నాను. ఇటీవల బాగా బరువు తగ్గాను, తిండి కూడా పూర్వంలాగా తినలేకపోతున్నాను. నోరు తరచుగా పూస్తోంది. బలవంతం మీద కాస్త కడుపులోకి తోసినా కొద్దిసేపటిలోనే వాంతి అవుతోంది. టి.బి. లాంటి జబ్బు, కేన్సరు లాంటి జబ్బు ఏదీ లేదు. అకారణంగా ఈ బరువు కోల్పోవడం ఏమిటో అంతుపట్టడం లేదు. నేను తిరిగి బరువు పుంజుకుని ఆరోగ్యంగా తయారవడం ఎలా?”
జవాబు:- హెచ్.ఐ.వి./ఎయిడ్స్లో త్వరితంగా బరువు కోల్పోవడం ఒక ముఖ్య లక్షణం. చాలా కారణాలున్నాయి. హెచ్.ఐ.వి. వల్ల రోగ నిరోధక శక్తి కోల్పోవడంతో ఆ వ్యక్తిలో తెలియకుండానే కొన్ని వ్యాధులు చోటుచేసుకుంటాయి. రకరకాల వైరల్, బాక్టీరియా, ప్రోటోజోవల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. అలాగే కేన్సరు వ్యాధి కూడా రావచ్చు. ఇవి ఇలా ఉండగా జీర్ణకోశం ప్రేగుల్లో షిగిల్లా, సాల్సునెల్లా, జియార్డియా, మైకో బాక్టీరియా వంటి వ్యాధి క్రిములు చోటుచేసుకుని రోగిని శుష్కింపచేస్తాయి. వాటివల్ల ఆకలి లేకుండా పోతుంది. కొందరిలో నాన్ హాడ్జికిన్స్ లింఫోమా, కపోసిన్ సార్కోమా వంటి వ్యాధులు కూడా చోటుచేసుకుంటాయి. ఇవి కూడా బరువు కోల్పోవడానికి కారణాలే.
హెచ్.ఐ.వి. రోగిలో నోటిపూత, నోటిపుండ్లు, నోట్లో కాండిడాసిన్ వచ్చి అన్నం తినాలని ఉన్నా తినకుండా చేస్తాయి. తగినంత ఆహారం తీసుకోకపోవడంతో బరువు కోల్పోవడం ఉంటుంది. కొందరిలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్కి వాడే మందుల వల్ల కూడా ఆకలి లేకుండా పోతుంది. ఏది ఏమైనా కారణాన్ని గుర్తించి దాన్ని సరిచేస్తే తిరిగి ఆకలి పుంజుకుంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం, విటమిన్లు, ఖనిజ లవణాల లోపం లేకుండా చూసుకోవడం, యాంటి రిట్రోవైరల్ డ్రగ్స్ వాడటం సక్రమంగా జరిగితే బరువు కోల్పోయిన రోగి తిరిగి కోలుకోవడం ఉంటుంది. పాలు, గుడ్లు, పళ్ళు, పప్పులు, ఎక్కువ తీసుకోండి. ఇవి బరువు పెరుగుదలకి, శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.