ప్రశ్న:- ”చిన్న పిల్లల్లో ఎయిడ్స్ ఉంటే తెలుసుకోవడం ఎలా? అమ్మా – నాన్నలకి లేకుండా పిల్లలకు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందా?”
జవాబు:- అమ్మా – నాన్నలకి ఎయిడ్స్ లేకుండా పిల్లలకు ఎయిడ్స్ వచ్చే అవకాశం లేదు. పిల్లలకి హెచ్.ఐ.వి. పరీక్ష చేయని రక్తం ఎక్కిస్తే దాని వల్ల ఎయిడ్స్ రావచ్చు. 20 శాతం పిల్లల్లో పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఎయిడ్స్ వ్యాధి బయటపడుతుంది. ఇంకో 40 శాతం మంది పిల్లల్లో 2-3 సంవత్సరాల్లోనే ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఒక 25 శాతం పిల్లల్లో 5-6 ఏళ్ళ తర్వాత నిదానంగా ఎప్పుడైనా ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. పెద్దవాళ్ళల్లో లాగానే పిల్లలు కూడా హెచ్.ఐ.వి. క్రిములు ఉన్నంత మాత్రాన నీరసపడరు. పెద్దవాళ్ళల్లో కంటే త్వరగా వీరిలో ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఎయిడ్స్ బయటపడిన బిడ్డల్లో బరువు కోల్పోవడం, నీరసపడటం, తిండి తినకపోవడం, తరచూ ఏదొక అనారోగ్యానికి గురికావడం, జ్వరం రావడం, విరోచనాలు అవడం వంటి లక్షణాలు ఉంటాయి. రక్త పరీక్ష చేస్తే సిడి4 కణాలు బాగా తగ్గిపోతాయని తెలుస్తుంది. ఇటువంటప్పుడు ఎఆర్వి మందులు మొదలుపెడితే వారి ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనబడుతుంది. ఎఆర్వి మందులు మొదలుపెడితే వారి ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనబడుతుంది. ఎఆర్వి మందులతో పాటు చక్కని పౌష్టికాహారం కూడా తినిపించాలి. పౌష్టికాహారం తీసుకునే పిల్లల్లో ఎయిడ్స్ వ్యాధి త్వరగా పెరగదు. సరైన కౌన్సిలింగ్, గైడెన్స్ ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైన పిల్లల భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దవచ్చు.