ప్రశ్న:-”నాకు షుగరు వ్యాధి వచ్చింది. కొందరు గోధుమ అన్నం తినమంటున్నారు. మరి కొందరు జొన్న అన్నం తినమంటున్నారు. ఇంకొందరైతే ఒకపూట వరి అన్నం, మరొకపూట చపాతీలు లేదా పుల్కాలు తినమంటున్నారు. వరి అన్నం తింటే షుగరు తగ్గదంటున్నారు. ఏది తినాలో, ఏది తినకూడదో అర్థంకాక గందరగోళంలో ఉన్నాను. షుగరు వచ్చిన వాళ్ళు వరి అన్నం తినకూడదా?”
జవాబు:-షుగరు ఉన్నవాళ్ళు పిండి పదార్థం ఉన్నవి తక్కువ తీసుకోవాలి. పిండి పదార్థం వరి, జొన్న, గోధుమ, దుంపకూరల్లో ఎక్కువగా ఉంటుంది. వరి అన్నం మానేసి జొన్న అన్నం, గోధుమ అన్నం తినడం వల్ల ప్రయోజనం లేదు. ఏ అన్నమైనప్పటికీ తగ్గించి తీసుకోవాలి. వరి, గోధుమ, జొన్న వీటన్నింటిలో పిండి పదార్థం దాదాపు ఒకే శాతంలో ఉంటుంది. వరి అన్నం బదులుగా గోధుమ, జొన్న అన్నం తినడం వల్ల షుగరు తగ్గదు. చపాతీలు, పుల్కాల్లో కూడా పిండి పదార్థం ఉంటుంది. కనుక అవి కూడా పరిమితంగానే తీసుకోవాలి. షుగరు ఉన్నదాన్ని బట్టి, మనిషి బరువును బట్టి, మనిషి చేసే పనిని బట్టి పిండి పదార్థం రోజు మొత్తంలో ఎన్ని గ్రాములు తినవచ్చో డాక్టరు నిర్థారిస్తారు. దానిని బట్టి వరి, గోధుమ, జొన్నలకి సంబంధించిన ఏవి తిన్నా అంతే తినాలి. దుంపకూరల్లో కూడా పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని మానేయడం అవసరం. అరటిపండు, సపోటా, సీతాఫలం వీటిల్లో షుగరు శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక తీసుకోకూడదు. స్వీట్స్ కూడా మానేయాలి. పళ్ళు ఏవి తినవచ్చు. ఎంతెంత తినవచ్చు అనేది డాక్టరు చెబుతారు. దాని ప్రకారం తీసుకోవాలి. ఆహారంలో జాగ్రత్త ఎంత ముఖ్యమో రోజూ వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. స్థూలకాయం లేకుండా చూసుకోవాలి. మీ విషయంలో ఎటువంటి గందరగోళం అవసరం లేదు. డాక్టరు చెప్పిన మోతాదు మేరకు వరి అన్నమే నిరభ్యంతరంగా తినండి. గోధుమలు, జొన్నలు అనవసరం లేదు.