ప్రశ్న:- ”అర్థ నారీశ్వరుడు అనే మాట తరచుగా వింటూ ఉంటాను. వాస్తవానిక అర్థ నారీశ్వరుడిని నేనెప్పుడూ చూడలేదు. దేహ పోటీలలో తమిళనాడు అమ్మాయి శాంతి స్త్రీల విభాగంలో విజయం సాధించినప్పటికీ ఆమె ఆడది కాదు మగాడని తేల్చివేసి ఇచ్చిన పతకాన్ని వాపసు పుచ్చుకున్నారు కదా. నాకు తెలియక అడుగుతున్నాను. పైకి తెలియకుండా ఆడవాళ్ళల్లో మగవాళ్ళు, మగవాళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారా? అది ఎలా సాధ్యం?”
జవాబు:- పుట్టుకతోనే లింగనిర్ధారణ జరుగుతుంది. స్త్రీలల్లో లింగ నిర్ధారణకి రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి. వీటినే సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. పురుషులలో లింగ నిర్ధారణకి ఎక్స్, వై అనే రెండు సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. పురుష లైంగిక నిర్ధారణ చేసే ‘వై’ క్రోమోజోమ్ ఒక్కటే ఉన్నప్పటికీ అది తన పవరు చూపించి ఎక్స్ క్రోమోజోమ్ ప్రభావం ఏమీ లేకుండా చేస్తుంది.
అరుదుగా కొందరిలో లైంగిక క్రోమోజోమ్ల అస్తవ్యస్తత కలుగుతుంది. లైంగిక క్రోమోజోమ్లు రెండే ఉండే బదులుగా 3-4 ఉంటాయి. అప్పుడు లైంగిక అవయవాల నిర్మాణంలో అస్పష్టత చోటు చేసుకుంటుంది. శాంతి విషయంలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లతో పాటు అదనంగా వై క్రోమోజోమ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వై క్రోమోజోమ్ ఉండటంతో ఆమెలో పురుష లైంగిక అవయవాలే ఏర్పడ్డాయి. అయితే స్పష్టంగా పురుష అవయవాలు పెంపొందలేదు.
ఎన్ని ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నప్పటికీ వై క్రోమోజోమ్ ఉంటే పురుష అవయవాలే ఉంటాయి. పైకి స్త్రీలాగా కనబడినప్పటికీ స్త్రీ మాత్రం కాదు. క్రోమోజోమ్ల అస్తవ్యస్తతతో పాటు హార్మోన్ల అస్తవ్యస్తత కూడా కలగడంతో పురుషుడే అయినప్పటికీ స్త్రీ లక్షణాలు కూడా కొంత చోటు చేసుకున్నాయి. ఈ విధమైన అస్పష్టత చోటుచేసుకోవడంతో శాంతి తల్లిదండ్రులు ఆమెను అమ్మాయిగా భావించారు. శాంతి పైకి అమ్మాయిగా కనబడినప్పటికీ కడుపు లోపల వృషణాలు ఉన్నాయి. కండరాలు పురుషులకి ఉండే విధంగా బలంగా తయారైనాయి. స్త్రీలకి సంబంధించిన గర్భాశయం కాని ఓవరీస్ కాని లేవు. అందుకనే సైంటిస్టులు ఆమెను పురుషుడిగా నిర్ధారించారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడిన వారిని వాడుకలో అర్థనారీశ్వరులుగా చెప్పుకోవచ్చు. లింగ నిర్ధారణలో అవయవాల అస్పష్టత ఉన్నప్పుడు క్యారియో టైపింగ్ వంటి పరీక్షలు, హార్మోన్ల టెస్టులు జరిపితే లింగనిర్థారణ తేలికగా జరుగుతుంది. దాని ప్రకారం ముందుగానే లోపాన్ని సరిదిద్దితే శాంతి లాంటి వాళ్ళు పరిపూర్ణమైన పురుషులుగానే రూపొందుతారు. క్రోమోజోమ్ల అస్తవ్యస్తత వల్ల ఇటువంటి అయోమయ పరిస్థితి మరికొన్నింటిలో కూడా కలుగుతూ ఉంటుంది. ఈనాడు జన్యుశాస్త్రం చక్కగా అభివృద్ధి చెందింది. లింగ నిర్ధారణలో గందరగోళం లేదు.