ప్రశ్న:- ”మంత్రం వేస్తే పాము విషం దిగిపోతుందా? మనిషికి ప్రాణగండం తప్పిపోతుందా?”
జవాబు:- మంత్రాల్లో ఎటువంటి శక్తీ లేదు. అది కేవలం మూఢనమ్మకమే. విషపాము కరిస్తే వెంటనే యాంటీ స్నేక్ వీనమ్ ఇంజక్షన్ చేయించాలి. అన్ని పాములు విషపాములు కాదు. విషపాములు కాని మామూలు పాములు కరిచినప్పుడు మంత్రాలు వేయించుకుని బ్రహ్మాండంగా మంత్రం పారిందని సంతోషిస్తారు. కొన్ని సందర్భాల్లో విషపాము కరచినప్పటికీ మనిషి కరవడానికి ముందు ఏ కప్పనో, ఎలుకనో కరిచినట్టయితే దాని కోరల్లోని విషం బయటకు వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత మనిషిని కరిచినప్పటికీ ఆ కోరల్లో విషం ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ ప్రాణాపాయం కలగనంతటి తక్కువ మోతాదులో ఉంటుంది. ఇటువంటప్పుడు కూడా మంత్రాలు నమ్మేవాళ్ళు మంత్రం గొప్పగా పనిచేసిందని సంతోషిస్తారు. అంతేగాని పాము కాటు ద్వారా వంట్లోకి విషం వెళ్ళలేదని లేదా ప్రాణాపాయం కలిగించేటంత విషం వెళ్ళలేదని తెలుసుకోరు. నిజంగానే ఎక్కువ మోతాదులో విషం శరీరానికి వెళితే మంత్రాలని నమ్ముకున్న వాళ్ళకి మరణమే గతి. అందుకని విషపాము కరిచినప్పుడు మంత్రగాళ్ళని ఆశ్రయించడం కాకుండా వెంటనే యాంటీ స్నేక్ వీనమ్ ఇంజక్షన్‌ను చేయించుకోవాలి.