ప్రశ్న:- ”నాకు పెళ్ళై 5 నెలలైంది. నా పెళ్ళి రోజుకి నెలసరి వచ్చి మూడు రోజులైంది. కాని ఆ విషయం అబ్బాయి వాళ్ళకి చెబితే పెళ్ళి ఇప్పుడు వద్దు అంటారేమోనని చెప్పలేదు. పెళ్ళైన మరుసటి రోజునే శోభనానికి ఏర్పాటు చేశారు. ఆ రోజు మేమిద్దరం కలిశాము. ఆ రోజున మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అయ్యింది. ‘కన్నెపొర చిరిగితే కొద్దిపాటి రక్తమే వస్తుంది. ఇప్పుడు రక్తం ఎక్కువ వచ్చింది కనుక ఇది నెలసరే. నెలసరి సమయం పెట్టుకుని పెళ్ళి, శోభనం ఎందుకు పెట్టావు’ అని నన్ను నిలదీశారు. పైగా మొదటి కలయిక చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని, జీవితంలో ఎల్లప్పటికీ మెమొరీగా మిగిలిపోతుందని, అది లేకుండా చేశానని ఆడిపోసుకున్నారు. ఇప్పుడు కూడా మాటిమాటికీ శోభనం రాత్రిని గుర్తు తెచ్చుకుంటూ మొదటిరాత్రి అనుభూతిని లేకుండా చేశానని తప్పు ఎత్తి చూపుతారు. నిజంగానే శోభనం రాత్రి మెన్సస్ వస్తే మొదటి కలయికలో థ్రిల్ లేకుండా పోతుందా? నాకు మెన్సస్ వచ్చిన విషయం చెప్పకపోవడం పెద్ద తప్పిదమా? నేను పెద్ద తప్పు చేసిన దానిలాగా అనుక్షణం కుమిలిపోతున్నాను. నా బాధని తొలగించగలరా?”
జవాబు:-శోభనం రాత్రి మెన్సస్ బ్లీడింగ్ వచ్చినంత మాత్రాన మొదటి కలయిక తృప్తి కలగకుండా పోదు. పురుషాంగానికి కొంత రక్తం అంటుకోవచ్చుగాని అనుభూతి లేకుండా చేయదు. తొలి కలయిక థ్రిల్ గురించి ఎందరో ఎన్నో కలలు కంటారు గాని వాస్తవానికి వచ్చేసరికి కలయిక సరిగ్గా కుదరక నిరాశ చెందేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. సెక్స్‌లో సుఖం అనిపించేది థ్రిల్‌గా ఫీలయ్యేది తొలికలయిక, మలికలయిక అనే దానిమీద ఆధారపడి లేదు. ఇద్దరి మధ్య చక్కని ఆకర్షణ, క్రేజ్, మంచి భాగస్వామ్యం ఉన్నట్టయితే ప్రతి కలయికా మధురంగానే ఉంటుంది. ఆ మధురమైన అనుభూతిని కేవలం తొలి కలయికకే లిమిట్ చేయనవసరం లేదు. అందుకని మీ వారితో వారు కోల్పోయింది ఏమీ లేదని చెప్పండి. మనస్సుని చక్కగా పంచుకున్నట్టయితే ప్రతిరాత్రీ తొలిరాత్రే అని చెప్పండి.