ప్రశ్న:-”ఎండాకాలంలో ఐస్నీళ్ళు తాగినా, ఎండలో నుంచి రాగానే చన్నీళ్ళు స్నానం చేసినా వడదెబ్బ తగులుతుందని అంటారు కదా. ఎందుకని?”
జవాబు:- ఎండాకాలంలో ఐస్నీళ్ళు తాగినా, ఎండలో నుంచి రాగానే చన్నీళ్ళు స్నానం చేసినా వడదెబ్బ తగులుతుందనుకోవడం అపోహ మాత్రమే. ఎండల్లో తిరగడం వల్ల లేదా గాలి ఆడని గదుల్లో నివసించడం వల్ల ఒళ్ళు వేడెక్కిపోతుంది. వేడెక్కిన ఒళ్ళు చల్లబడటానికని చర్మంలోని స్వేదగ్రంథులు అతిగా పనిచేసి బాగా చెమట పట్టిస్తాయి. ఆ రకంగా ఒంటిని చల్లబరచడానికి కృషి చేస్తాయి. అధిక సమయం ఎండవేడికి గురైతే స్వేద గ్రంథులు అలసిపోయి చెమట పట్టడం తగ్గిపోతుంది. దాంతో బయట వేడి నిరాటంకంగా శరీరంలోకి చేరుతుంది. దానివల్ల ముఖ్యంగా కేంద్ర నాడీమండలం దెబ్బతింటుంది. అలా జరగకుండా ఉండాలంటే చన్నీళ్ళు తాగడం, చర్మాన్ని చల్లగా ఉంచుకోవడం, ఎండలోకి వెళ్ళి రాగానే చన్నీళ్ళతో స్నానం చేసి వేడెక్కిన చర్మాన్ని చల్లబరచడం చేయాలి. అలా చేయకపోతే హీట్ రెగ్యులేటరీ మెకానిజం దెబ్బతిని అతి తేలికగా వడదెబ్బ తగులుతుంది. అర్థంలేని మూఢనమ్మకాలతో, అపోహలతో చేయవలసింది చేయకుండా వడదెబ్బకి గురవుతున్నారు కొందరు. ఎండాకాలంలో అధికంగా చెమటపట్టి శరీరంలో నుంచి నీరు, ఉప్పు బయటకి పోతుంది. దానివల్ల డీహైడ్రేషన్ కలగడం, ఉప్పు సాంద్రత తగ్గి కండరాల నొప్పులు రావడం ఉంటాయి. అందుకని ఎండాకాలంలో అధికంగా నీరు తాగడం అవసరం. అలాగే మజ్జిగలో గాని, పళ్ళ రసాల్లోగాని ఉప్పు కలుపుకుని తాగడం అవసరం. ముఖ్యంగా చంటిపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, రేకుల షెడ్డులో ఉండేవాళ్ళు, గాలి ఆడని గదుల్లో ఉండేవాళ్ళు, పొయ్యిల దగ్గర పనిచేసేవాళ్ళు, ఎండలో తిరిగేవాళ్ళు, పగటిపూట ప్రయాణం చేసేవాళ్ళు అధికంగా నీరు, ఉప్పు తీసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఒంటిమీద తడిగుడ్డ కప్పుకోవాలి. ఎండలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా గొడుగు వాడాలి. ఎండనుంచి ఎలా కాపాడుకోవాలో, ఎందుకు కాపాడుకోవాలో తెలిసుండాలి. అంతేగాని ఐస్నీళ్ళు తాగితే, కూల్డ్రింక్ తీసుకుంటే, ఐస్క్రీం తింటే, మామిడిపళ్ళు తీసుకుంటే వేడి చేస్తుందనో, వడదెబ్బ తగులుతుందనో అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి.