ప్రశ్న:- ”మాకున్న పరిస్థితులు ప్రకారం రాత్రి పూట సెక్స్‌లో పాల్గొనేందుకు అవకాశం కుదరదు. పగటిపూటే భోజనం అయిన తర్వాత కాస్త ఏకాంతం కుదురుతుంది. అప్పుడే మేమిద్దరం ఒకటి అవుతాం. పగటిపూట సెక్స్‌లో పాల్గొంటే ఏమైనా అనర్థమా? పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యాలతోనూ, అనారోగ్యాలతోనూ పుడతారా? అదీకాక భోజనం చేసిన వెంటనే సెక్స్‌లో పాల్గొంటే ప్రమాదమా?”
జవాబు:- సెక్స్‌లో పాల్గొనడానికి పగలు, రాత్రి అని తేడా లేదు. ఎప్పుడైనా పాల్గొనవచ్చు. పగలు పాల్గొంటే అంగవైకల్యంతో, అనారోగ్యంతో పిల్లలు పుడతారనుకోవడం నిజం కాదు. భోజనం చేయగానే సెక్స్‌లో పాల్గొనప్పటికీ ఏమీ అవదు. కాని చాలామందిలో భుక్తాయాసం ఉంటుంది. దానివల్ల సెక్స్‌లో అంత యాక్టివ్‌గా పాల్గొనలేరు. కడుపునిండా కాకుండా ఒక మోస్తరుగా భుజించి సెక్స్‌లో పాల్గొంటే భుక్తాయాసం అనిపించదు. వయస్సు మళ్ళిన కొందరిలో భోజనం చేయగానే సెక్స్‌లో పాల్గొంటే ఛాతీలో కొద్దిగా నొప్పి అనిపించవచ్చు. ఇటువంటి వాళ్ళలో యాంజైనా అనే గుండెనొప్పి ఉండవచ్చు. ఈ నొప్పి ఉన్న వాళ్ళల్లో మామూలుగానే కడుపునిండా భోజనం చేస్తే నొప్పి అనిపిస్తుంది. అటువంటప్పుడు వీళ్ళు సెక్స్‌లో పాల్గొంటే యాంజైనా గుండెనొప్పి పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళు తప్ప మామూలు ఆరోగ్యవంతులు భోజనం అవగానే సెక్స్‌లో పాల్గొన్నా ఏమీ అవదు. కాని భోజనం తర్వాత ఒక గంట ఆగి సెక్స్‌లో పాల్గొంటే సాధారణంగా ఎటువంటి ఆయాసం ఉండదు.