ప్రశ్న:- ”నా వయస్సు 65 సంవత్సరాలు. పూర్వం నాకు పూజల మీద, దేవుళ్ళు, దేవతల మీద నమ్మకం ఉండేది కాదు. బాబాల దగ్గరికి వెళ్ళేదాన్ని కాను. కొంతకాలం క్రిందట భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళవీ చిన్నపాటి సంసారాలే. ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నారు. బాబాలు, స్వాముల మీద గౌరవం లేని నేను ఇప్పుడు ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందాను. ఇక్కడ ఉన్నప్పటికీ మనస్సుకి శాంతి లేదు. ఏదో వెలితి అనుక్షణం వేధిస్తూ ఉంటుంది. మా వారు ఉన్నప్పుడు వారి చివరి రోజు వరకు సెక్స్‌లో బాగా ఎంజాయ్ చేసిన దాన్ని. ఇప్పుడు సెక్స్ కోరికలు కూడా లేవు. ఎప్పుడూ ఏదో దిగులు, ఒంటరితనం బాధిస్తున్నాయి. నమ్మకం లేని ఆశ్రమాలు, పూజలు ఇందుకు కారణమా? నా మానసిక అనారోగ్యం కారణమా? అంతా గందరగోళంగా ఉంది. ఏం చేయాలి?”
జవాబు:- పూజలు, పునస్కారాలు, బాబాలు, స్వాముల మీద నమ్మకం లేనప్పుడు వాటిని అనుసరిద్దామనుకుంటే కుదిరేది కాదు. అందులోనూ హేతువాద దృక్పథం ఉన్నప్పుడు అసలు కుదరదు. మీకు భర్త పోవడంతో, పిల్లలు దగ్గిర లేకపోవడంతో డిప్రషన్ చికిత్స పొందండి. తప్పకుండా మామూలు అవుతారు. ఆ తరువాత మీకు నచ్చిన పని ఏదైనా చేపట్టండి. అది మీకు తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. జీవితం చివరి దశలో మీలాగే చాలామంది గందరగోళ మనస్తత్వం కలిగి ఉంటారు. డిప్రషన్‌కి గురి అవుతారు. జీవితం బాధామయంగా మారుతుంది. సరైన కౌన్సిలింగ్తోనూ, మానసిక చికిత్సతోనూ మోడువారిన జీవితాన్ని తిరిగి చిగురింపచేయవచ్చు. అంతేగాని జీవచ్ఛవంలా బ్రతకనవసరం లేదు.