ప్రశ్న:-”డెలివరీ అయిన తరువాత రోజూ తలకు, నడుముకు గుడ్డ కట్టుకోవాలా? లేనిచో బెల్ట్ వాడాలా? చెవిలో దూది అవసరమా? వేడినీళ్ళే తాగాలా? భోజనంలో పెరుగు, గోంగూర, వేరుశెనగ, చిలగడదుంప తినకూడదా? ఆరు నెలల వరకు దాంపత్య సంబంధాలకి దూరంగా ఉండాలా? బాలింతరాలుకి ఎన్నో పథ్యాలు, నిషిద్ధాలు ఉన్నాయి. కాన్పు అయిన స్త్రీకి ఇవి చాలా గందరగోళంగా ఉంటాయి. వాటి గురించి వివరణ ఇచ్చి నాలాంటి బాలింతరాళ్ళకి సలహా ఇవ్వగలరు.
జవాబు:- బాలింతరాలుకి ప్రత్యేకమైన పథ్యాలు, నిషిద్ధాలు లేవు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న పథ్యాలు, నిషిద్ధాలు అన్నీ అర్థం లేనివే. కాన్పు అనేది వ్యాధి కాదు. అతి సహజంగా జరిగిపోయే విషయం. బాలింతరాలు చెవిలో దురదలు, తలకట్టు, నడుముకి గుడ్డకట్టు ఏమాత్రం అవసరం లేదు. కొందరికి పొట్ట కండరాల పటుత్వం తగ్గి పొట్ట ఎత్తుగా కనబడుతుఞది. అలాంటి వాళ్ళకే ఎబ్డామినల్ బెల్టు కావాలి. అలాంటి వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రతి బాలింతరాలు కాన్పు తరువాత డాక్టరు చెప్పిన మేరకు కొద్దిపాటి స్పయినల్, ఎబ్డామినల్ ఎక్సర్సైజు చేస్తే సాగిపోయిన కండరాలు, లిగమెంట్లు త్వరగా మామూలై నడుమునొప్పి అనిపించదు. ఎందరికో ఇటువంటి ఎక్సర్సైజు అవసరం లేకుండా అన్నీ ఇట్టే మామూలు అవుతాయి. బాలింతరాలు కాన్పు అయిన మరుక్షణం నుంచే అన్నీ తినవచ్చు. తినకూడనివి ఏవీ లేవు. వేడినీళ్ళు తాగనవసరం లేదు. ఫ్రిజ్లోని నీళ్ళు కడుపునిండా తాగవచ్చు. పళ్ళు, పళ్ళరసాలు అన్నీ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. బాలింతరాలు చన్నీళ్ళు తాగినా, పళ్ళరసాలు తాగినా, ద్రాక్షపళ్ళు తిన్నా చంటిబిడ్డకి జలుబు చేస్తుందనడంలో నిజం లేదు. చంటి బిడ్డకి జలుబు చేయడం జరిగితే వాతావరణంలోని వైరస్ వల్లేగాని బాలింతరాలు పథ్యం చేయకపోవడం వల్ల కాదు. అర్థం లేని పథ్యాలు, నిషిద్ధాలు పక్కన పెట్టి బాలింతరాలు చక్కగా ఉండవచ్చు. కాన్పు అయిన నెల నుంచి మామూలుగా దాంపత్యంలో పాల్గొనవచ్చు.