ప్రశ్న:-”ఎయిడ్స్‌కి మందు లేదా… ఉంది” అని కొందరు పేపర్లో ప్రకటనలు ఇస్తారు. ఏవేవో పేర్లు రాసి వారికి తగ్గిపోయిందని అంటారు. నిజంగానే ఎయిడ్స్ క్యూర్‌కి కొన్ని వైద్యాల్లో మందు ఉందా? ఎందుకిలా అడుగుతున్నానంటే నాకు 5 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ బయటపడింది. అప్పుడు ఎయిడ్స్‌తో పాటు టి.బి., హెర్పిస్ జోస్టర్ జబ్బులు కూడా వచ్చి సీరియస్ అయింది. డాక్టరుకి చూపించుకోగా మందులు ఇచ్చారు. టి.బి. తగ్గిపోయింది. ఆరోగ్యం బాగుపడింది. కాని డాక్టరుగారు ఎయిడ్స్‌కి జీవితాంతం ఎ.ఆర్.వి. మందులు వాడాలన్నారు. నా భార్యకి కూడా ఎయిడ్స్ ఉంది. అదృష్టం కొద్దీ బిడ్డలకి లేదు. ఇద్దరం మందులు వాడుతున్నాం. మా ఇద్దరికీ మందుల కోసం నెలకి 4 వేలు అవుతోంది. నిజంగానే మందులతో ఎయిడ్స్‌కి క్యూర్ ఉంటే ఎంత ఖరీదైనా వాడాలని అనుకుంటున్నాం. మా బాధని అర్ధం చేసుకుని సరైన సలహా ఇవ్వండి.”
జవాబు:-ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా ఎయిడ్స్ పూర్తిగా నయమవడానికి మందులేదు. ఎవరైనా ఉందని చెబితే అవి కేవలం మోసపు మాటలే. ఎవరైనా తమ మందులతో ఎయిడ్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని సాక్ష్యాధారాలుగా చూపిస్తే అవన్నీ కట్టుకథలు లేదా బిల్డప్ స్టోరీస్. బి.పి., షుగర్‌ని అదుపులో ఉంచడానికి ఎలా మందులు ఉన్నాయో అదేవిధంగా ఎయిడ్స్ కూడా ముదరకుండా యాంటి రిట్రోవైరల్ (ఎ.ఆర్.వి.) మందులు ఉన్నాయి. ఇది తప్ప మరేవీ ఈ వ్యాధిని అరికట్టేందుకు లేవు. ఈనాడు కొన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో ఎ.ఆర్.టి. సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కొంతవరకు ఎ.ఆర్.వి. మందులు ఇస్తున్నారు. డబ్బులు పెట్టి ఎ.ఆర్.వి. కొనుక్కోవడం కష్టంగా ఉంటే కనుక మీ దగ్గర్లోని ఎ.ఆర్.టి. సెంటర్లో సంప్రదించండి. మందుల విషయంలో సహాయం అందవచ్చు. ఎయిడ్స్‌ని పూర్తిగా నయం చేస్తామనే బోగస్ డాక్టర్ల మాటలకి మోసపోయి ఉన్న కాస్త డబ్బులు పోగొట్టుకోకండి.