ప్రశ్న:- ”మా అబ్బాయికి తరచుగా టాన్సిల్స్ వాచి గొంతులో నొప్పి అనిపిస్తుంది. జ్వరం కూడా వస్తూ ఉంటుంది. మందులు వాడితే తాత్కాలికంగా తగ్గుతుంది. మా అబ్బాయి పీలగా, పొట్టిగా ఉంటాడు. టాన్సిల్స్ ఆపరేషన్ చేస్తే పొడవు పెరుగుతాడా?”
జవాబు:- పొడుగు ఎదగడానికి, టాన్సిల్స్ ఆపరేషన్కీ సంబంధం లేదు. టాన్సిల్స్ తరచూ వాస్తూ, జ్వరం వస్తూ, గొంతు నొప్పి చేస్తూ ఉంటే డాక్టరుకి చూపించి, డాక్టరు ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేయడం ఒక్కటే సరైన మార్గం. కొందరు పిల్లలు టాన్సిల్స్ ఆపరేషన్ అయిన తర్వాత బలంగా, ఆరోగ్యంగా తయారవుతారు. పొడవు అవుతారు. అది చూసి టాన్సిల్స్ ఆపరేషన్ చేస్తే పొడవు పెరుగుతారని అపోహ పడి పొట్టిగా ఉండే పిల్లలకి టాన్సిల్స్ వాపు లేకపోయినప్పటికీ ఆపరేషన్ చేయించాలని కొందరు పెద్దలు అనుకుంటారు. అసలు విషయం తెలియకే వాళ్ళు అలా భావిస్తారు. సాధారణంగా తరచూ టాన్సిల్స్ వాచి, చీము పట్టేవాళ్ళు సరైన తిండి తినక, ఏదో ఒక అనారోగ్యానికి గురై పీలగా, నీరసంగా ఉంటారు. వీళ్ళకి ఆపరేష్ అవడంతో ఇన్ఫెక్షన్ తొలగి వెంటనే తిండి ఒంటపట్టి ఆరోగ్యంగా తయారవుతారు. కొందరు టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ బాగానే ఎదుగుతారు. అందుకని ఎత్తు ఎదగడానికి, టాన్సిల్స్ ఆపరేషన్ చేయడానికి సంబంధం లేదు. మీ అబ్బాయి విషయంలో డాక్టరుకి చూపించి వారి సలహా మేరకు చేయండి.