ప్రశ్న:- ”నా వయస్సు 19 సంవత్సరాలు. సన్నగా ఉంటాను. ఎత్తు కూడా అంతగా ఎదగలేదు. కారణం తెలీదు. నాకు అప్పుడప్పుడు నిద్రలో స్ఖలనం అయిపోతుంది. వీర్యం పోవడం వల్ల మగవాడు నీరసపడతాడని, ఎదగకుండా అవుతాడని అంటారు కదా. నేను కూడా అందువల్లే నీరసపడ్డానా? ఇంద్రియ నష్టం జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఇంతవరకూ కోల్పోయిన ఇంద్రియాన్ని తిరిగి చేకూర్చుకోవాలంటే ఏమేమి తినాలి? నేను బాగా లావుగా, ఎత్తుగా, బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలో తెలియజేయండి.”
జవాబు:- యుక్తవయస్సు వచ్చిన తర్వాత తెలిసో తెలియకుండానో ఇంద్రియం బయటికి పోతుంది. ఇంద్రియం పోవడం వల్ల మగపిల్లవాడు నీరసపడడం, ఎత్తు ఎదగకపోవడం ఉండదు. ఇంద్రియం పోవడం వల్లే నీరసపడేటట్లయితే పెళ్ళయి రోజూ దాంపత్యంలో పాల్గొనే వాళ్ళంతా నీరసపడవలసిందే. అలాగేమీ జరగదు. ఇంద్రియం విలువైనది కాదు. ఎంతపోయినా నష్టం లేదు. మీరు నీరసంగా ఉండటానికి వేరే కారణాలు ఉంటాయి. సాధారణంగా ఎదిగే వయసులో సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే సరైన ఎదుగుదల ఉండదు. పీలగా ఉంటారు. సాధారణంగా ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ 12 సం||ల నుంచి 18 సం||ల వరకు అన్ని విధాలా ఎదుగుతారు. ఈ వయస్సులో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, మాంసం, పప్పులు, పళ్ళు తీసుకున్నట్లయితే పిల్లలు ఏపుగా ఎదుగుతారు. ఆహారంతో పాటు వ్యాయామం కూడా అత్యంత అవసరం. రోజుకి కనీసం గంట సేపు ఒళ్ళు అలిసేలా ఆడటం లేదా వ్యాయామం చేయడం అవసరం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చదువుల మీదే శ్రద్ధంతా పెడుతూ ఆటల విషయంలో నిర్లక్ష్యం, ఆహారం విషయంలో అశ్రద్ధ కనబరుస్తున్నారు. అటువంటప్పుడే నీరసంగా తయారవుతారు. మీ విషయంలో ఒకసారి డాక్టర్‌ని సంప్రదించండి. డాక్టర్ చెప్పినట్లు చేయండి. చాలావరకు ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేగాని వీర్యం పోతోందని దిగులు చెందకండి.