ప్రశ్న:-”మా వారి వయస్సు 55. నా వయస్సు 45. మాకు ముగ్గురు పిల్లలు. ఈనాటికీ మావారికి రోజూ సెక్సు కావాలి. ఒక్కొక్కసారి రోజుకి 2-3 సార్లు కావాలి. నాకు నెలకి 1-2 సార్లే మూడ్ వస్తుంది. నాకు సెక్సు మీద ఏవగింపు రావడానికి ఆయన ధోరణే కారణం. నేను అలసిపోయి ఉన్నానా, హుషారుగా ఉన్నానా అనేది ఆయనకి అనవసరం. ఆయనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆయన పక్కకి చేరాలి. సెక్సులో విసుగు రావడానికి ఆయన అలా ఫోర్సు చేయడమే కారణం. భార్యని కనుక ఆయన కోరిక తీర్చడానికి సహకరిస్తాను. అది ఆయనకి సరిపోదుట. నేను సెక్సు విషయంలో ఎంతో ఆసక్తి కనబరచాలని, యాక్టివ్గా కనబడాలని అంటారు. నా ధోరణిని ఆ సమయంలో నిందిస్తూ, నేను పనికిరానిదాన్నని, నా కంటే బజారు లేడీ బెటర్ అని ఘోరంగా మాట్లాడతారు. ఇవన్నీ భరిస్తూ ఆయనకి ఒళ్ళు అప్పగిస్తాను. ఇలాంటి మనిషితో ఎలా చచ్చేదో తెలియడం లేదు. రెండు-మూడు రోజులకి ఒకసారైతే, అది కూడా అలసట లేనప్పుడైతే నేను యాక్టివ్గా ఆసక్తి చూపగలను. కాని అది ఆయన గమనించరు. పైగా సెక్స్ ఎంతో సుఖం అందిస్తూ ఉంటే, అవసరం లేనట్టు ప్రవర్తిస్తావేమిటి అని అంటారు. మా సంసారంలో సుఖశాంతులు నెలకొనేందుకు ఏమైనా సలహా ఇవ్వగలరా?”
జవాబు:- మీ వారు సెక్స్ సుఖం గురించే ఆలోచిస్తున్నారు గాని, మీరెందుకని ఉత్సాహంతో భాగస్వామ్యం పంచుకోవడం లేదో అర్థం చేసుకోవడం లేదు. పైగా ఆయనకి సెక్స్ సుఖం అనిపిస్తుంది కనుక మీకూ అనిపిస్తుందుర భావంతో ఉన్నారు. మానసిక పరిస్థితులు, శారీరక పరిస్థితుల మీద సెక్స్ సుఖం ఆధారపడి ఉంటుందని గుర్తించడం లేదు. ఏది ఏమైనా ఇద్దరూ సెక్సుకి సమాయత్తం అయినప్పుడే ఆ సుఖం పొందాలి కాని, ఫోర్సుతో కాదు. జీవిత భాగస్వాముల్లో ఒకరు ఆసక్తి చూపకపోతే ఎందుకో అర్థం చేసుకోవాలి. రెండవ వాళ్ళు ఆసక్తి చూపకపోయినా, సెక్సు ఎడల విసుగు కనబరుస్తున్నా ముందుగా తమ ప్రవర్తనలో, మాటతీరులో, వ్యవహరించే తీరులో తప్పులు ఉన్నాయేమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండవవారి వైపు నుంచి తనని తాను పరిశీలించుకుని తమ తప్పులని సంస్కరించుకోవాలి. మీ విషయంలో ఇద్దరూ డాక్టరుని కలిసి కపుల్ కౌన్సిలింగ్ పొందండి. దాంతో ఎవరెవరిలో ఎటువంటి మార్పు తెచ్చుకోవాలో తెలుస్తుంది. సమన్వయం కుదురుతుంది. సంసారం చక్కబడుతుంది.