ప్రశ్న:- ”ఆపరేషన్లు, గాయాలైనప్పుడు, చీముగడ్డలు, పుళ్ళు ఏర్పడినప్పుడు పప్పు పదార్థాలు తింటే చీముపట్టే అవకాశం ఉందా? పిల్లలకి పుళ్ళు ఉన్నప్పుడు వద్దన్నప్పటికీ శనగపప్పు, వేరుశనగపప్పులు తినేస్తూ ఉంటారు. వాళ్ళని ఆపడం ఎలా? ఏ పప్పులు తింటే చీము ఎక్కువ పట్టే అవకాశం ఉంది? చీము తక్కువ పట్టే పప్పులు ఏవి?”
జవాబు:- పప్పులు తినడం వల్ల గాయాలు చీము పట్టవు. అది అపోహే తప్ప నిజం కాదు. పప్పులు తినడం వల్ల నిజానికి గాయాలు త్వరగా మానుతాయి. ఏ పప్పుల్లోనూ చీముకి కారకమయ్యేవి ఉండవు. చీముపట్టడానికి బాక్టీరియా క్రిములే కారణం గాని పప్పులు కాదు. పప్పుల్లో బాక్టీరియా క్రిములు ఉండవు. పప్పుల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్లు కండపుష్టికి, యాంటీబాడీస్ తయారీకి తోడ్పడతాయి. అందుకని గాయాలు, ఆపరేషన్లు, పుళ్ళు పడిన పరిస్థితుల్లో పప్పులు మరింత ఎక్కువ తింటే త్వరగానూ, చక్కగానూ కోలుకుంటారు.