ప్రశ్న:- ”దేవుని పటాల నుంచి విభూతి రాలుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది. ఇందులో ఏమైనా మ్యాజిక్ ఉందా? దైవ మహిమేనా?”
జవాబు:- దేవుని పటాల నుంచి విభూతి రాలడం కేవలం మ్యాజిక్. మహాత్మ్యాల పేరిట చేసేవన్నీ గారడీలే. దేవుని పటం ఫ్రేము అల్యూమినియంతో గానీ, దానికి అనుబంధమైన మెటీరియల్తో గానీ చేస్తే ఆ ఫ్రేముకి మెర్క్యురిక్ క్లోరైడ్ సొల్యూషన్ రాస్తే అది ఎండిపోయి అల్యూమినియంతో రసాయనిక మార్పులు చెందుతుంది. ఈ రసాయనిక చర్యవల్ల అల్యూమినియం ఫ్రేము పై వరస పిండిగా మారి పౌడరుగా రాలుతుంది. మరికొన్ని రకాల రసాయనాలు పటంపైన గ్లాసు మీద రాస్తే అది కూడా అద్దంతో రసాయనిక మార్పులు చెంది బూడిదగా రాలుతుంది. ఇలా చేసి కొందరు మోసగాళ్ళు దేవుని పటం నుంచి విభూతి రాలుతోందని, వాళ్ళ దుకాణంలోనో, ఇంట్లోనో దైవ మహాత్మ్యం జరుగుతోందని పబ్లిసిటీ చేసుకుంటారు. దేనినీ గుడ్డిగా నమ్మేయకుండా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం అవసరం.