ప్రశ్న:- ”ముస్లింలు పీర్ల పండగప్పుడు అల్లాహో అక్బర్ అంటూ పీర్లు పట్టుకుని నిప్పుల మీద నడుస్తారు. అలాగే హిందువులు కొన్ని ఉత్సవాల సందర్భంలో హరహర మహదేవ అంటూ నిప్పుల మీద నడిచే ముందు పుణ్యస్థానాలు ఆచరించడం, దైవపూజలు చేయడం ఉంటాయి. నిప్పుల మీద నడవడం దైవ మహాత్మ్యమా? నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలకపోవడానికి దేవుని కృపే కారణమా?”
జవాబు:- నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలకపోవడం దైవ మహాత్మ్యం కాదు. దేవుని మీద నమ్మకం లేనివాళ్ళు నడిచినా అవేమీ కాలవు. నిప్పుల మీద నడిచినప్పుడు కాళ్ళు కాలకపోవడానికి శరీర ధర్మం, గ్లొబాయిడల్ యాక్షన్ అనే భౌతికశాస్త్ర సూత్రం కారణం. చింత, తుమ్మ వంటి కలపని 1-2 టన్నులు ఒక మీటరు లోతు, 4-5 మీటర్లు పొడవు గుంటలో వేసి కణకణ మండేటట్టు చేసి ఆ నిప్పులని ఆ గుంటలో బల్లపరుపుగా సర్ది దానిమీద వడివడిగా పది అడుగులు వేస్తే కాళ్ళు ఏమీ కాలవు. దీనికి కారణం అలా ఎర్రగా కాలిన నిప్పు ఆ సమయంలో 400-500 డిగ్రీల సెంటీగ్రేడ్ హీట్ ఉండటమే కారణం. మామూలుగానే మంచ ఎండ ఉన్నప్పుడు మనకి విపరీతంగా చెమటపోసి చర్మం వేడెక్కకుండా కాపాడబడుతుంది. అదే విధంగా నిప్పుల గుండంలో అడుగు వేయబోయే సమయంలో పాదం దగ్గర చర్మంలో తడి బాగా తయారవుతుంది. కణకణలాడే నిప్పుల మీద పాదం పడీ పడగానే ఆ నిప్పు వేడికి చర్మానికి పట్టిన నీరు ఆవిరి పొరగా మారి నిప్పుకీ, పాదానికీ మధ్య కవచంగా తయారవుతుంది. ఆ కవచం కొన్ని క్షణాలు ఉండి నిప్పుల వేడి చర్మానికి సోకకుండా నిరోధిస్తుంది. నిప్పు మీద చకచకా నడుచుకుంటూ పోతూంటే అడుగుపడ్డ ప్రతిసారీ ఆవిర పొర ఏర్పడి పాదం కాలకుండా నిరోధిస్తుంది. ఈ ప్రక్రియనే భౌతికశాస్త్రంలో గ్లొబాయిడల్ యాక్షన్ అంటారు. ఈ యాక్షన్ వల్లే కమ్మరి కొలిమి దగ్గర కణకణలాడే ఇనుప రాడ్ మీద నీళ్ళు జల్లితే కొన్ని క్షణాల పాటు నీళ్ళు ఆవిరి అయిపోకుండా బుడగల్లాగా నిలిచిపోవడం చూస్తాము. అగ్నిగుండంలో నిప్పు వేడి ఉండవలసినంత తీవ్రంగా లేకపోతే మాత్రం కాళ్ళు కాలతాయి. అప్పుడు దేవుడు కూడా రక్షించలేడు.