ప్రశ్న:-”నాకు షుగర్ ఉంది. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. మానలేక పోతున్నాను. షుగర్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా? తీసుకుంటే నష్టమా? ఒకవేళ ఆల్కహాలు తీసుకునేటట్టయితే విస్కీ, వైన్, బీర్ వంటి వాటిల్లో ఏవి తీసుకోవచ్చు? లేదా అన్ని రకాలూ తీసుకోవచ్చా? ఎవరో చెప్పగా విన్నాను. గుండెజబ్బు ఉన్నవాళ్ళు, కొలెస్టరాల్ ఉన్న వాళ్ళు ఆల్కహాలు తీసుకుంటే మంచిదని. అది నిజమేనా?”
జవాబు:- ఆల్కహాలు వల్ల ఆరోగ్యానికి ప్రత్యేకంగా ప్రయోజనం లేదు. దానిలో పౌష్టిక విలువలు ఏమీలేవు. అనవసరంగా కాలరీలు పెరుగుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కేలరీలు మంచిది కాదు. ఆల్కహాలు వల్ల రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. దానివల్ల రక్తనాళాల గోడలు దళసరై నష్టాలు కలుగుతాయి. ఆల్కహాలు తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళల్లో అకస్మాత్తుగా షుగర్ తగ్గిపోయి నీరసం వచ్చే అవకాశమూ ఉంది. అంతేకాకుండా ఆల్కహాలు తీసుకోవడం వల్ల షుగర్ ఉన్నవాళ్ళు బరువు పెరుగుతారు. అది మంచిది కాదు. బరువు పెరగడంతో షుగర్ మరింత పెరుగుతుంది. ఆల్కహాలు వల్ల కాలేయం దెబ్బతింటుంది. సిర్రోసిస్ లివరు వస్తుంది. రక్తపోటు ఉన్నవాళ్ళకి రక్తపోటు మరింత పెరుగుతుంది. మెదడులో నాడీకణాలు ఎండిపోతాయి. మెదడు చురుకుదనం తగ్గుతుంది. నరాల మంటలు వస్తాయి. నరాలు మొద్దుబారుతాయి. పాన్క్రియాస్ గ్రంథి దెబ్బతింటుంది. ఇన్ని జరిగే అవకాశం ఉంది. కాబట్టే ఆల్కహాలు మంచిది కాదు. ఒకవేళ ఆల్కహాలు మానలేకపోతే షుగర్ బాగా అదుపులోకి వచ్చిన తరువాతే తీసుకోవాలి. మామూలు వైన్, విస్కీ, బీర్ తీసుకోకూడదు. కేవలం డ్రైలైన్, లైట్ బీర్ తీసుకోవాలి. అది కూడా కొద్ది మోతాదులో తీసుకోవాలి. ఆల్కహాలు ఎప్పుడూ భోజనంతోనే తీసుకోవాలి. ఇన్ని నిషిద్ధాలకంటే ఆల్కహాలు పూర్తిగా మానివేయడం మంచిది.