ప్రశ్న:- ”నా వయస్సు 65 సంవత్సరాలు. ఇటీవల కొద్ది నెలలుగా అంగం స్తంభించినప్పుడు అంగంలో నొప్పి వస్తోంది. అంగం స్తంభించకపోతే ఏ నొప్పి ఉండదు. మూత్రానికి వెళితే మంట రావడంగాని, నొప్పి అనిపించడం గాని, మాటిమాటకీ రావడం గాని లేవు. షుగరు లేదు, బి.పి. లేదు. అంగంలో నుంచి చీము కారడం లేదు. ఇంతవరకు భార్యతో తప్ప పరాయి స్త్రీతో సెక్సు ఎంజాయ్ చేయలేదు. అయినా సెక్సులో పాల్గొన్నప్పుడు అంగంలో నొప్పి ఎందుకో అంతుపట్టడం లేదు. మా ఆవిడకి ఏ బాధా లేదు. లేడీ డాక్టరు చేత చెకప్ చేయించుకుంది. అంతా ఆల్రైటు అన్నారు. అంగం మెత్తగా ఉన్నప్పుడు చేతితో నొక్కి చూస్తే ఒకటి, రెండు చోట్ల చింత పిక్కలంత గట్టి పదార్థం తగులుతోంది. ఇదివరకెప్పుడూ నేను అలా నొక్కి చూసుకోలేదు. ఇలా ఉండటం మామూలేనా, కొత్తగా గడ్డలేమైనా వచ్చాయా? ఇదేమైనా కేన్సర్ అవుతుందా? అయితే అంగం గట్టిపడకపోయినా, సెక్స్‌లో పాల్గొనకపోయినా ఏ బాధా లేదు. ఆరోగ్యంలో తేడా లేదు, నా సమస్యకి పరిష్కారం చూపండి.
జవాబు:- 40-50 సంవత్సరాలు దాటిన తరువాత కొందరు పురుషులలో పెరోనీస్ డిసీజ్ అనేది వస్తుంది. ఇదేమీ కేన్సరు కాదు. ప్రమాదకరమైనది కాదు. లైంగిక వ్యాధి వల్ల వచ్చేది కాదు. పురుషాంగంలో ఉండే ఫైబ్రస్ పొర కొంతమేర మందంగా మారి సాగే గుణం కోల్పోయి అంగం స్తంభించినప్పుడు సాగక బాధ కలిగిస్తుంది. పెరోనీస్ డిసీజ్ వచ్చిన వారిలో అంగంలో చిన్న గడ్డగా తగలడమే కాకుండా, స్తంభించినప్పుడు అంగంలో సొట్టలు 1-2 పడతాయి. పెరోనీస్ డిసీజ్ ప్రారంభంలో కొన్ని నెలలు నొప్పి ఉంటుంది. తరువాత నొప్పి లేకుండా పోతుంది. దీని గురించి భయపడనవసరం లేదు. పెరోనీస్ డిసీజ్ తగ్గిపోవడానికి సరైన మందులు లేవు. విటమిన్-ఇ 400 మిల్లీ గ్రాముల క్యాప్సుల్స్ రోజుకి ఒకటి చొప్పున కొన్ని నెలలు వాడితే కొంత ఫలితం ఉంటుంది.