ప్రశ్న:-”విగ్రహాలు పాలు తాగుతాయనడంలో సైన్సు ఉందా? మహత్యం ఉందా? లేదా మెస్మరిజం ఉందా?”
జవాబు:- కొంతకాలం క్రిందట వినాయక విగ్రహాలు పాలు తాగుతున్నాయని దేశమంతటా అలజడి కలిగింది. అది అంతా దైవ మహాత్మ్యంగా భావించారు. తండోపతండాలుగా వినాయకుని విగ్రహాలకి చెంచాలతో పాలుపట్టారు. వాస్తవానికి వినాయకుడి విగ్రహాలు పాలు తాగలేదు. పాలు తాగినట్టు భక్తులు భ్రమించారంతే.
విగ్రహానికి ఆన్చిన చెంచాలోని పాలు తరిగిపోవడానికి సైంటిఫిక్ సూత్రం ఉంది. ప్రతి పదార్థంలోనూ అణువులన్నీ ఒక దానితో ఒకటి బంధింపబడి ఉంటాయి. ఈ శక్తిని ‘కొహిషన్’ అంటారు. అలాగే విభిన్న పదార్థాలలోని అణువులు ఒక విధమైన అతుక్కునే శక్తిని కలిగి దాని మూలంగా ఆకర్షించబడతాయి. దీన్నే ఎడ్‌హిషన్ అంటారు. ఈ గుణాలు ద్రవ పదార్థాలు, ఘన పదార్థాల మధ్య అధికంగా ఉంటాయి. అందుకనే చెంచా పాలు విగ్రహానికి తాకించినప్పుడు ద్రవం ఉపరితలం విగ్రహం చేత ఆకర్షింపబడింది. ఆ తరువాత విగ్రహం మీదుగా కిందకి కారడం జరిగింది. వినాయకుని విగ్రహానికి చెంచాతో పాలు పట్టినప్పుడు విగ్రహానికి ఆనించిన చెంచాలలోని పాలు తరగడం చూసి, వినాయకుని విగ్రహం పాలు తాగుతోందని అనుకున్నారు. అంతే గాని విగ్రహం పైనుంచి పాలు కారిపోవడం గమనించలేదు. అలా కారిన పాలు విగ్రహం చుట్టూ వేసిన పూలల్లో లేదా విగ్రహానికి చుట్టిన బట్టల్లో కలిసిపోతాయి.
చెంచాతో పాలని ఒక సీసాకి లేదా ఒక చెక్క ముక్కకి లేదా గోడకి లేదా మామూలు రాయికి అంటించినా చెంచాలలోని పాలు ఖాళీ అవుతాయి. పాలే కాదు, నీళ్ళయినా ఖాళీ అవుతాయి. దీనికి కారణం ద్రవ పదార్ధాలకి, ఘన పదార్ధాలకి మధ్య ఉన్న ఆకర్షణ శక్తి మాత్రమే. అంతేతప్ప విగ్రహాలు పాలు తాగడం కాదు, మహాత్మ్యమూ కాదు. మహాత్మ్యాలు అనేవి లేనేలేవు.