ప్రశ్న:- ”కొండనాలిక వాలితే దగ్గు వస్తుందా? కొండ నాలికని కత్తిరిస్తే తప్ప దగ్గు తగ్గదా?”
జవాబు:- కొండనాలికనే చిరునాలిక అంటారు. ఇది నోటిలోపల పై వైపున ఉంటుంది. అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల వాస్తుంది, ఉబ్బుతుంది. సాధారణంగా చిరునాలిక వాచినప్పుడు గొంతు వెనుక కూడా వాపు ఉంటుంది. టాన్సిల్స్ కూడా వాయవచ్చు. ఇటువంటి పరిస్థితిలో దగ్గు కూడా ఉంటుంది. దగ్గు గొంతు ఇన్ఫెక్షన్ రావడం వల్ల వస్తుంది. అది తెలియక కొండనాలిక వాలడం వల్ల దగ్గు వస్తోందని అనుకుంటారు. నాటు వైద్యుని దగ్గరికి వెళితే కొండనాలిక వాలింది కనుక కత్తిరించాలంటాడు. కొండనాలిక కత్తిరించందే దగ్గు తగ్గదంటాడు. రోగి అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని అతని దగ్గర డబ్బులు గుంజుకుని కొండనాలికని కత్తిరించకుండానే, కత్తిరించినట్టు నటన చేస్తాడు. నిజంగానే నాటు వైద్యుడు కొండనాలికని కత్తిరిస్తే ఆగకుండా రక్తం కారుతుంది. ఊపిరితిత్తుల్లో క్షయ, కేన్సరు వంటి వ్యాధులు, ఇస్నోఫీలియా ఉంటే విడవకుండా దగ్గు వస్తుంది. దగ్గుకి మూలకారణాన్ని గుర్తించి సరైన చికిత్స చేసినప్పుడు దగ్గు తగ్గుతుంది. చాలా సందర్భాలలో అమాయకులు దగ్గు రావడానికి కారణం తెలుసుకోలేక కొండనాలిక వాలిందని నాటు వైద్యుణ్ణి ఆశ్రయిస్తారు. అతను నాలిక కత్తిరించినట్టు యాక్షన్ చేస్తాడు. చివరకు ఎలాగూ డాక్టరుని సంప్రదిస్తే తప్ప దగ్గు తగ్గదు. మామూలు దగ్గులు ఏ మందులూ వాడకుండానే వారం – పది రోజుల్లో తగ్గిపోతాయి. అంతేగాని కొండనాలికకి నాటువైద్యుడు చేసే చికిత్స వల్ల కాదు.