ప్రశ్న:- ”నా వయస్సు 45 సంవత్సరాలు. మా వారు ఎయిడ్స్‌తో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత నాకూ ఎయిడ్స్ ఉందని తెలిసింది. నాకు ఇద్దరు మనవలున్నారు. మా వారు పోయిన దగ్గర నించి మా అమ్మాయి దగ్గరే నేను ఉంటున్నాను. మనుమలిద్దరికీ నేను అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు నా మీద పడి కుమ్మేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో నన్ను ముద్దులు కూడా పెట్టుకుంటారు. నేనూ ఇదివరకు వాళ్ళని ముద్దులు పెట్టుకునేదాన్నే. కాని ఎయిడ్స్ ఉందని తెలిసిన దగ్గర నుంచి ముద్దులు పెట్టుకోవడం లేదు. నేను వాళ్ళకి అన్నం తినిపిస్తే తప్ప తినరు. నా చేత్తో అన్నం తినిపిస్తే వాళ్ళకి ఏమైనా అవుతుందేమోనని భయం. మా అమ్మాయి కూడా నువ్వు వద్దులే, నేనే తినిపిస్తాలే అంటుంది. ఎయిడ్స్ జబ్బు కంటే ఇటువంటివే నన్నెంతో బాధపెడుతున్నాయి. త్వరగా చావురావాలని కోరుకుంటున్నాను. కాని అంతవరకైనా నా మనుమలతో దగ్గరగా ఉండే అవకాశం ఉందా? నా మనస్సుని అర్థం చేసుకుని సలహా ఇవ్వండి.”
జవాబు:- హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ మామూలుగా ముట్టుకుంటే, ముద్దులు పెట్టుకుంటే వచ్చేది కాదు. అందుకని మీ మనుమలని చక్కగా దగ్గరికి తీసుకోండి. వాళ్ళ బుగ్గ మీద, నుదురు మీద, మెడమీద కావలసినన్ని ముద్దులు పెట్టండి. వాళ్ళకి మీ మనస్సు తీరేదాకా గోరు ముద్దలు తినిపించండి. హెచ్.ఐ.వి. ఉన్నప్పటికీ చేతితో తినిపించడం వల్ల ఆ వ్యాధి ఇంకొకరికి చేరదు. పిల్లలకి కావలసిన సేవలన్నీ చేయండి. ఈ జబ్బు కేవలం ఆ జబ్బు ఉన్న వాళ్ళతో సెక్స్‌లో పాల్గొంటేనూ, ఆ డబ్బు ఉన్నవాళ్ళ రక్తాన్ని ఎక్కించుకుంటేనూ, ఆ జబ్బు ఉన్నవాళ్ళకి ఇంజక్షన్లు చేసిన సూదితో ఇంజక్షను చేయించుకుంటేనూ మాత్రమే వస్తుంది. కలిసిమెలసి ఉండటం, కలసి భుజించడం ఏ విధంగానూ హానికరం కాదు. మీరు అనవసరంగా దిగులు చెందవద్దు, బాధపడవద్దు.