ప్రశ్న:-”గోధుమ అన్నం తింటే షుగరు తగ్గుతుంది?”
జవాబు:- గోధుమ అన్నం తిన్నంత మాత్రాన షుగరు తగ్గదు. షుగరు ఉన్నవాళ్ళు పిండి పదార్థం ఉండే ఆహార పదార్థాలని తక్కువ భుజించాలి. దుంపకూరలు, వరి, గోధుమ, జొన్నలు వీటన్నింటిలోను పిండిపదార్థం ఎక్కువే ఉంటుంది. అయినా వరి అన్నం మానేసి గోధుమ అన్నం తిన్నప్పుడు కొంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే – గోధుమ, జొన్నల మీద ఉండే పై పొట్టులో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ పిండి పదార్థంతో మిళితమై ప్రేగుల గోడల నుంచి త్వరగా పీల్చుకోబడకుండా రక్తంలోకి చేరకుండా అడ్డుపడుతుంది. రక్తంలో అధిక శాతంలో షుగరు పేరుకొని పోకుండా తోడ్పడుతుంది. వరి అన్నం తినేవాళ్ళు కూడా తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం కాకుండా విసురుడు బియ్యం, దంపుడు బియ్యం తిన్నట్టయితే బియ్యంపైన ఉండే పొట్టు (ఫైబర్) గోధుమలలో లాగానే పిండి పదార్థంతో మిళితమై త్వరగా రక్తంలోకి చేరకుండా నిరోధిస్తుంది. అందుకని షుగరు ఉన్నవాళ్ళు పాలిష్ పెట్టిన తెల్లని బియ్యం కంటే విసురుడు బియ్యం, దంపుడు బియ్యం తినడం ఆరోగ్యకరం. ఏది తిన్నా తక్కువగానే తినాలి. భుజించిన దాంట్లోని పిండి పదార్థం త్వరగా షుగరుగా రక్తంలోకి చేరకుండా మరింత తోడ్పడేందుకు పీచుపదార్థం ఎక్కువగా ఉండే బెండకాయ, బీరకాయ, తోటకూర, బచ్చలి, గోంగూర వంటివి తప్పకుండా భుజించాలి. భోజనంలో పీచుపదార్థం ఉన్న వాటిని భుజిస్తే త్వరగా షుగరు లెవెల్స్ పెరగవు. డయాబెటిక్స్ ఉన్నవారికి ఆహార విజ్ఞానం ఉంటే వ్యాధిని తేలికగా అదుపులో ఉంచుకోగలుగుతారు.