ప్రశ్న:- ”నా భార్యకి కాన్పు సమయంలో అధికంగా రక్తస్రావం అవడంతో అత్యవసరంగా రక్తం ఎక్కించారు. రక్తాన్ని ఎయిడ్స్‌తో సహా అన్ని పరీక్షలు చేసి ఎక్కించినప్పటికీ మా ఆవిడకి హెచ్.ఐ.వి. వచ్చింది. విండో పిరియడ్‌లో ఉన్న వ్యక్తి రక్తం దానం చేయడం వల్ల అరుదుగా ఇటువంటి పరిస్థితి సంభవించవచ్చని డాక్టర్లు చెప్పారు. లక్కీగా ఆమె ద్వారా నాకు హెచ్.ఐ.వి. సంక్రమించలేదు. మా ఇద్దరిలోనూ లైంగిక వాంఛలు చక్కగా ఉన్నాయి. మా ఆవిడకి హెచ్.ఐ.వి. ఉన్నప్పటికీ, జాగ్రత్తగా కండోమ్ వాడుతూ దాంపత్య సుఖాన్ని ఇద్దరం అనుభవిస్తున్నాం. ఎప్పుడైనా అనుకోకుండా కండోమ్ చిరిగిపోయినా, జారిపోయినా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు హెచ్.ఐ.వి. రాకుండా రక్షణ ఉంటుందా? ఉండదా?”
జవాబు:- హెచ్.ఐ.వి. ఉన్న స్త్రీతో దాంపత్యంలో పాల్గొన్న పురుషుడు కండోమ్ జారిపోవడంగాని, చిరిగిపోవడంగాని గుర్తిస్తే వెంటనే పురుషాంగాన్ని ఉపసంహరించి సబ్బుతో రుద్ది నీళ్ళతో వాష్ చేసుకోవాలి. వెంటనే మూత్ర విసర్జన కూడా చేయాలి. ఇలా చేస్తే పురుషాంగానికి చేరిన హెచ్.ఐ.వి. క్రిములు వాష్ అవుట్ అయిపోతాయి. సబ్బు రుద్ది కడగడంతో వైరస్ క్రిములు అతి తేలికగా నిర్మూలించబడతాయి. అనుకోకుండా హెచ్.ఐ.వి. ప్రమాదానికి గురైన వాళ్ళు పిఇపి ట్రీట్‌మెంట్ ద్వారా ఆ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. పిఇపి ట్రీట్‌మెంట్‌కి సంబంధించిన మందులు సెక్స్‌లో పాల్గొన్న గంటా, రెండు గంటలలోగా మొదలుపెట్టాలి. ఈ మందులు 28 రోజులు వాడితే సరిపోతుంది. పిఇపి ట్రీట్‌మెంట్ విషయంలో జిడోవిడిన్, లామ్‌విడిన్, నెల్ఫినావిర్ అనే మూడు మందుల కాంబినేషన్ వాడతారు. ఇది ఏ మోతాదులో వాడవలసిందీ, ఎలా వాడవలసిందీ డాక్టరు చెబుతారు. మీ ఫ్యామిలీ డాక్టరుని సంప్రదించండి. జీవిత భాగస్వామికి హెచ్.ఐ.వి ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలతో మామూలుగానే దాంపత్యంలో పాల్గొనవచ్చు.