ప్రశ్న:- ”నా వయస్సు 18 సంవత్సరాలు. ఇంకా పెళ్ళి కాలేదు. తెలుపు ఎక్కువ అవుతోంది. తెలుపు ఎక్కువ అవడం వల్లనో, మరెందువల్లనో కాళ్ళు తెగ గుంజుతున్నాయి. నీరసంగా ఉంటుంది. కళ్ళ కింద నలుపు కూడా వచ్చింది. ముఖంలో గ్లోకూడా తగ్గిందని మా స్నేహితురాండ్రు అంటున్నారు. నాకు నెలనెలా మెన్సస్ బాగానే వస్తుంది. బ్లీడింగ్ మామూలుగానే అవుతుంది. నేను నీరసపడటానికి తెలుపు ఎక్కువ అవడమే కారణం అనుకుంటున్నాను. ఆడపిల్లలకు తెలుపు ఎంత మేరకు అవవచ్చు? ఎంత అయితే బలహీన పడతారు? వివరింగా తెలుపగలరు.”
జవాబు:- యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లల్లో గాని, కాస్త వయస్సు వచ్చిన యువతుల్లో గాని తెలుపు సహజంగానే అవుతుంది. అదేమీ వ్యాధి కాదు. తెలుపు అవడంవల్ల నీరసపడరు. కాళ్ళు గుంజవు. ముఖంలో గ్లో తగ్గదు. కొందరిలో కొన్ని వ్యాధుల వల్ల తెలుపు అధికంగా అవుతుంది. వ్యాధుల వల్ల తెలుపు అయ్యే స్త్రీలల్లో మర్మావయాలు దగ్గర దురద అనిపిస్తుంది. తెలుపు కొంత వాసన కూడా వేస్తుంది. రంగులో కూడా మార్పు ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళికాని ఆడపిల్లల్లో అయ్యే తెలుపు సాధారణంగా ఏ వ్యాధికీ సంబంధించింది కాదు. కొందరిలో కాస్త ఎక్కువ అవవచ్చు. అంత మాత్రాన వ్యాధి కాదు. సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువ కలిగినప్పుడు కూడా తెలుపు ఎక్కువ అవవచ్చు. అదీ జబ్బు కాదు. కొందరు అమ్మాయిలకు మర్మావయాల దగ్గర వేలితో ఒరిపిడి కలిగించుకుని స్వయంతృప్తి పొందే అలవాటు ఉంటుంది. దానివల్ల కూడా తెలుపు ఎక్కువ అవుతుంది. అయినా ఆ అలవాటు తప్పుకాదు, హానికరం కాదు. మీ విషయంలో కాళ్ళు గుంజడానికి కళ్ళ కింధ నలుపుకి ముఖంలో గ్లో తగ్గడానికి పౌష్టికాహార లోపం కారణం కావచ్చు. లేదా నిద్ర తగినంత లేకపోవచ్చు. లేదా చదువువల్ల, ఇతర కారణాల వల్ల టెన్షన్ ఎక్కువ ఉండవచ్చు. రక్తహీనత కూడా కారణం కావచ్చు. ఒకసారి డాక్టరు చేత జనరల్ చెకప్ చేయించుకోండి. మంచి ఆహోరం తీసుకోండి. టెన్షన్లు తగ్గించుకోండి. కంటి నిండా నిద్రపోండి. ఆపైన ఏ బాధా ఉండదు.